Varun: నా ఫేవరెట్‌ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నా: వరుణ్ తేజ్‌

Varun Tej: ఆపరేషన్‌ వాలెంటైన్‌ చిత్ర ప్రచారంలో భాగంగా మల్లారెడ్డి కాలేజ్‌లో ‘గగనాల తేలేను నీ ప్రేమలోన’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ విడుదల కార్యక్రమం జరిగింది.

Published : 07 Feb 2024 02:12 IST

హైదరాబాద్‌: తన ఫేవరెట్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠినే (Lavanya Tripathi) పెళ్లి చేసుకున్నానని వరుణ్‌ తేజ్‌ (Varun Tej) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులతో చిత్ర బృందం ముచ్చటించింది. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ సమాధానం ఇచ్చారు. ‘మీ ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు’ అని అడగ్గా, ‘నా ఫేవరెట్‌ హీరోయిన్‌నే నేను పెళ్లి చేసుకున్నా. మంచి కథలు వస్తే, నేనూ లావణ్య కలిసి చేస్తాం. మా ఇద్దరిలో నేనే మొదట ప్రపోజ్‌ చేశా’ అని అన్నారు. లావణ్య కాకుండా తనకు సాయిపల్లవి అంటే అభిమానమని చెప్పారు. 

‘‘ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదేనేమో. కామెడీలు వంద చేయొచ్చు. కానీ, దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. నేను చేయబోయే తర్వాతి చిత్రం ‘మట్కా’ పూర్తి మాస్‌ మూవీ. గద్దల కొండ గణేష్‌ తరహాలో అందులో నా పాత్ర ఉంటుంది. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌తో మూవీ చేయాలని నాకూ ఉంది. మంచి కథ దొరకాలి కదా’’ అని వరుణ్‌ తేజ్‌ చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకూ ప్రేమ కథల్లో మెప్పించిన వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లో పైలట్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.‘దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇందులో అద్భుతంగా చూపించాం’ అని చిత్ర బృందం చెబుతోంది.  సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ‘గగనాల తేలేను నీ ప్రేమలోన’ అంటూ సాగే పాటకు మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని