Varun Tej: కల్యాణ్‌ బాబాయ్‌ ఇలా చెప్పడం అరుదు: వరుణ్‌ తేజ్‌

తన కొత్త సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్‌ తేజ్‌.

Published : 27 Feb 2024 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన బాబాయ్‌, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాల గురించి ఎక్కువగా చర్చించరని, కానీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం ఆనందాన్నిచ్చిందని వరుణ్‌ తేజ్‌ (Varun Tej) అన్నారు. వరుణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.

ప్యాషన్‌ ఉన్న దర్శకుడు..

శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించాడు. విన్న వెంటనే నాకు నచ్చింది. యుద్ధ నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తున్న సోనీ పిక్చర్స్‌ సంస్థనూ ఈ స్టోరీ ఆకట్టుకుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించాలనే లక్ష్యంతో సినిమాని ప్రారంభించాం. ముందుగా తెలుగులోనే తెరకెక్కించాలనుకున్నా సోనీ పిక్చర్స్‌ సలహాతో హిందీలోనూ షూట్‌ చేశాం. శక్తి ప్రతాప్‌ సినిమాపై ప్యాషన్‌ ఉన్న దర్శకుడు. ఏదోటి చేసేయాలని అనుకోకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాడు. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో రీసెర్చ్‌ చేశాడు. ఇదే నేపథ్యంలో తాను తీసిన షార్ట్‌ఫిల్మ్‌ చూసి ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ఆశ్చర్యపోయారు. తర్వాత, సినిమా చేస్తున్నామని చెబితే కొంత సమాచారం అందించారు.

‘ది బెస్ట్‌’ అన్నారు..

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. అది ప్రేమికుల రోజు కాబట్టి శత్రువులకు సర్జికల్‌ స్ట్రైక్‌ను రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చినట్లైంది. ఈ సినిమా విషయంలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశంపై ఉన్న ప్రేమ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ టైటిల్‌ పెట్టాం. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటనపై ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్‌’ ది బెస్ట్ అని వారు ప్రశంసించారు.

అలా నటించడం కష్టం..

నేనిందులో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌ రుద్రగా కనిపిస్తా. ఫైటర్‌ ఫ్లైట్‌ ఎలా పనిచేస్తుంది? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? తదితర వివరాలను ఓ పైలట్‌ని అడిగి తెలుసుకున్నా. సిమ్యులేటర్‌లో కూర్చోబెట్టి అన్నీ నేర్పించారు. ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని నటించడం కష్టమనిపించింది. కొన్ని సన్నివేశాల్లో కళ్లతోనే ఎమోషన్స్‌ పండించాల్సి వచ్చింది. మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆమె రాడార్‌ ఆఫీసర్‌గా నటించారు.

బాబాయ్‌ అభినందించారు..

ఈ సినిమా టీజర్‌ విడుదలయ్యాక పవన్‌ కల్యాణ్‌ బాబాయ్‌ని కలిశా. ఆయనెప్పుడూ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ, మా మూవీ టీజర్‌ని పలుమార్లు చూశానని, చాలా బాగుందని చెప్పడంతోపాటు ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌గా బాగున్నావ్‌.. అని కితాబిచ్చారు. సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఏ చిత్రం విషయంలోనైనా బాబాయ్‌ ఇలా అనడం అరుదు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో నేను నటిస్తున్న ‘మట్కా’ పీరియాడికల్‌ ఫిల్మ్‌. అందులో పెర్ఫామెన్స్‌కు అధిక ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నా’’ అని వరుణ్‌ తేజ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని