Varun Tej: నిహారిక పొలిటికల్‌ ఎంట్రీ: వరుణ్‌ తేజ్‌ ఏమన్నారంటే?

తన కొత్త సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రచారంలో బిజీగా ఉన్నారు వరుణ్‌ తేజ్‌. ఆ క్రమంలోనే తన సోదరి నిహారిక పొలిటికల్‌ ఎంట్రీపై జరిగిన ప్రచారంపై స్పందించారు.

Published : 22 Feb 2024 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిహారిక (Niharika) రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని, ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఇటీవల జరిగిన ప్రచారంపై ఆమె సోదరుడు, నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) స్పందించారు. అవి రూమర్స్‌ అని ఖండించారు. సోషల్‌ మీడియాలో ఉపయోగం లేని ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తాయన్నారు. తన కొత్త సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) ప్రమోషన్స్‌లో భాగంగా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆయన్ను మీడియా ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ‘‘మా కుటుంబమంతా బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌)కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుంది. మా అవసరం ఎంత? మేం ఏం చేయాలి? అనేది పెద్దలు చెబితే చేయడానికి రెడీ’’ అని స్పష్టంచేశారు.

వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇతివృత్తంగా శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రమే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఇందులో వరుణ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) హీరోయిన్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. రియల్‌ హీరోల గురించి చాటి చెప్పే ఇలాంటి సినిమాల్లో నటించడాన్ని అదృష్టంగా భావించానని వరుణ్‌ ఓ సందర్భంలో తెలిపారు. దేశభక్తి నేపథ్యంలో గతంలో తాను నటించిన ‘కంచె’కు మించిన ఎమోషన్స్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లో ఉన్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని