Varun tej: ఈ దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబోస్‌ది కూడా!

‘‘ఏం జరిగినా సరే.. చూసుకుందాం’’ అంటూ కదన రంగంలోకి దూసుకెళ్తున్నారు వరుణ్‌ తేజ్‌. ఆయన ఇదంతా చేస్తోంది ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కోసమే.

Updated : 19 Dec 2023 09:28 IST

‘‘ఏం జరిగినా సరే.. చూసుకుందాం’’ అంటూ కదన రంగంలోకి దూసుకెళ్తున్నారు వరుణ్‌ తేజ్‌. ఆయన ఇదంతా చేస్తోంది ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కోసమే. వరుణ్‌ హీరోగా శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలోకి రానుండగా.. సోమవారం ఫస్ట్‌ స్ట్రైక్‌ పేరుతో టీజర్‌ విడుదల చేశారు. ‘‘మన ఎయిర్‌ఫోర్స్‌ను ఇంకొక దేశంలోకి పంపించడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే’’ అంటూ ఓ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి చెప్పే సంభాషణతో మొదలైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ దేశభక్తి చిత్రం రూపొందింది. భారత వైమానికదళ వీరుల అసమానమైన సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ‘‘శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్‌ చంద్రబోస్‌ది కూడా’’ అంటూ ప్రచార చిత్రంలో వరుణ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన ఇందులో అర్జున్‌దేవ్‌ అనే ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిగా కనిపించనున్నారు. టీజర్‌లో కనిపించిన సన్నివేశాల్ని బట్టి ఈ సినిమా భారత వైమానిక దళం చేపట్టిన భారీ మెరుపు దాడుల నేపథ్యంలో సాగనున్నట్లు అర్థమవుతోంది. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందించగా.. మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని