Vishal: సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్‌

తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్‌ కార్డ్‌ జారీ చేయడంపై నటుడు విశాల్‌ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Published : 18 Apr 2024 18:27 IST

హైదరాబాద్‌: తన తదుపరి చిత్రం ‘రత్నం’ (Rathnam) ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌లో సందడి చేశారు నటుడు విశాల్‌ (Vishal). ఇందులో భాగంగా ఆయన వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. అనంతరం, తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్‌ కార్డ్‌ జారీ చేయడంపై స్పందించారు. ‘‘ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కి గతంలో నేనూ ప్రెసిడెంట్‌గా వర్క్‌ చేశా. నాకు తెలిసినంత వరకూ రెడ్‌ కార్డ్‌ అనేది ఫుట్‌బాల్‌లో ఇస్తారు. సినిమాల్లో కాదు. సినిమాలు తెరకెక్కించకుండా ఖాళీగా కూర్చొనే వాళ్లే ఇలాంటివి ఆలోచిస్తారు. సినిమాలు తీసేవారు ఎవరూ ఇలా ఆలోచించరు’’ అని అన్నారు.

తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు కూడా అడుగుతున్నారు. ఆర్యకు పెళ్లయ్యాక చేసుకుంటానని చెప్పేవాడిని. ఇప్పుడు అతడికి పెళ్లైంది. ఇకపై ప్రభాస్‌ పెళ్లి తర్వాత నేను చేసుకుంటా అని చెబుతా (నవ్వులు). పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండాలని నేను అనుకోవడం లేదు. దానికంటూ సరైన సమయం రావాలి. నా వరకూ పెళ్లి అనేది పెద్ద బాధ్యతతో కూడుకున్నది. నాకోసం వచ్చే అమ్మాయిని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలి. ఆమెకు సమయం కేటాయించాలి. ప్రస్తుతం నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆయా బాధ్యతలతోనే సమయం సరిపోతుంది’’ అని బదులిచ్చారు.

కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి రెడ్‌ కార్డు జారీ చేసినట్లు గతేడాది వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్‌ నిధులను విశాల్‌ (Vishal) దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్‌ కార్డు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని