Vishwak Sen: ‘అర్జున్‌తో వివాదం.. డబ్బులు చెల్లించారా?’ విశ్వక్‌సేన్‌కు విలేకరి ప్రశ్న

‘దాస్‌ కా ధమ్కీ’ ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అర్జున్‌ సర్జాతో నెలకొన్న వివాదంపై స్పందించారు  

Published : 18 Mar 2023 15:20 IST

హైదరాబాద్‌: నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు విశ్వక్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అర్జున్‌ సర్జా(Arjun)తో నెలకొన్న వివాదంపై స్పందించమని విలేకరి కోరగా ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. ఆ విషయం గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని సమాధానమిచ్చారు. ‘‘అర్జున్‌తో కాంట్రవర్సీ తర్వాత మీరు పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బులు చెల్లించారని విన్నాను. ఆ విషయంలో మీరెంతో బాధపడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది ఎంతవరకూ నిజం?’’ అని విలేకరి ప్రశ్నించగా.. బదులిచ్చేందుకు విశ్వక్‌ ఆసక్తి కనబర్చలేదు. ‘‘దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే, ఆ వ్యవహారానికి ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అని బదులిచ్చారు.

‘దాస్‌ కా ధమ్కీ’కి మొదట నరేశ్‌ కొప్పిలిని దర్శకుడిగా అనుకుని తర్వాత తానే మెగా ఫోన్‌ పట్టడం వెనకున్న కారణంపై హీరో స్పందించారు. ‘‘నరేశ్‌ కొప్పిలి నేనూ కలిసి ‘పాగల్‌’ సినిమా చేశాం. ‘దాస్‌ కా ధమ్కీ’ అనుకున్నప్పుడు.. ఈ సినిమాకు అతడైతే సరిగ్గా న్యాయం చేయగలడనుకున్నా. అందుకే ఈ చిత్రానికి  దర్శకుడిగా తొలుత ఆయన్నే తీసుకున్నాం. కథ గురించి చర్చించుకున్నప్పుడు.. అతడి ఆలోచనా విధానానికి, నేను అనుకున్న స్టోరీకి పొంతన కుదరలేదు. అందుకే నేనే మెగా ఫోన్‌ పట్టాను. అతడితో మరో సినిమా చేస్తానని చెప్పాను. గొడవపడటం లేదా వాదనలు జరగడం లాంటివి ఏమీ జరగలేదు’’ అని తెలిపారు. 

‘ఓరి దేవుడా..!’ (Ori Devuda) తర్వాత విశ్వక్‌ నుంచి వస్తోన్న చిత్రమిది. ఆయనే దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 22న ఇది విడుదల కానుంది. అర్జున్‌ వివాదం విషయానికి వస్తే.. తన కుమార్తె హీరోయిన్‌గా, విశ్వక్‌ సేన్‌ హీరోగా అర్జున్‌ ఓ సినిమాని పట్టాలెక్కించారు. అయితే, విశ్వక్‌ సరిగ్గా సెట్స్‌కు రావడం లేదని.. ఏదో ఒక కారణం చెప్పి షూటింగ్‌ రద్దు చేస్తున్నాడని.. వర్క్‌ పట్ల అతడి ప్రవర్తన ఏమీ బాగోలేదంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి అర్జున్‌ ఆరోపించారు. కథ విషయంలో తనకి కాస్త ఇబ్బంది ఉందని, అది చెప్పినా అర్జున్‌ వినడం లేదని అప్పట్లో విశ్వక్‌ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు