Warner-Australia: ఓపెనర్‌ వేటలో ఆస్ట్రేలియా.. మరో వార్నర్‌ వస్తాడా?

Eenadu icon
By Sports News Team Published : 08 Jan 2024 15:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

క్రీజులో అడుగుపెడితే చాలు బాదుడే అతని మంత్రం. ఆరంభం నుంచే భారీ షాట్లతో చెలరేగడం అతని నైజం. ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసి మానసికంగానూ పైచేయి సాధించడం అతని వ్యూహం. దిగ్గజాల నిష్క్రమణ తర్వాత సంధి దశలో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్‌గా అతను నిలదొక్కుకున్న తీరు.. అద్భుత ప్రదర్శనతో పరుగుల వేటలో సాగిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు దశాబ్దానికిపైగా కంగారూ జట్టు ప్రధాన ఆటగాడిగా కొనసాగిన ఆ క్రికెటరే.. డేవిడ్‌ వార్నర్‌ (David Warner). ఇప్పుడు టెస్టులు, వన్డేలను అతను వదిలేశాడు. టీ20ల్లోనే కొనసాగుతానని చెప్పాడు. మరి వార్నర్‌ లాంటి మరో ఆటగాడు ఆస్ట్రేలియాకు దొరుకుతాడా? టెస్టులు, వన్డేల్లో ఓపెనర్‌గా ఆడేది ఎవరు?

ప్రత్యేక ముద్ర

ఇన్నింగ్స్‌ ఆరంభం కాగానే బ్యాటింగ్‌కు వచ్చామా.. వికెట్‌ పడగానే పెవిలియన్‌లో వెళ్లి కూర్చున్నామా.. ఫీల్డర్‌గా మైదానంలో ఉన్నామా.. అంటే ఉన్నామా అన్నట్లు వార్నర్‌ ఉండేవాడు కాదు. అలా ఉంటే వార్నర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న క్రికెట్లో వేలాది మంది ఆటగాళ్లు వచ్చారు. ఆట నుంచి నిష్క్రమించారు. కానీ ఇందులో కొద్దిమంది మాత్రమే ఆటపై తమదైన ముద్ర వేశారు. ఇలాంటి ఆటగాళ్ల వీడ్కోలు క్రికెట్‌ ప్రపంచానికి బాధ కలిగిస్తుంది. వార్నర్‌ కూడా ఇలాంటి కోవకు చెందిన ఆటగాడే. బౌలర్లపై పైచేయి సాధించాలనే కసితో అతని బ్యాటింగ్, ఎలాగైనా బంతిని ఆపాలనే సంకల్పంతో ఫీల్డింగ్‌.. ఇలా బరిలో దిగితే చాలు జట్టు కోసం వంద శాతం కష్టపడే ఆటగాడు అతను. 

తగ్గేదేలే

దూకుడైన ఆటగాడిగా కెరీర్‌ మొదలెట్టినా.. మధ్యలో వివాదాలు చుట్టుముట్టినా.. అడ్డంకులను దాటి, బాధను వెనక్కినెట్టి వార్నర్‌ తిరిగి పుంజుకున్నాడు. ముఖ్యంగా బాల్‌ టాంపరింగ్‌ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొని ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. మళ్లీ ఆడలేనేమోనని కుంగిపోయాడు. కానీ అక్కడితో ఆగిపోకుండా సమస్యలు ఎన్ని వచ్చినా తగ్గేదేలేదంటూ సాగిపోయాడు. పునరాగమనంలోనూ అదరగొట్టి ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు. కంగారూ జట్టు తరపున రెండు వన్డే ప్రపంచకప్‌ (2015, 2023)లు, ఓ టీ20 ప్రపంచకప్‌ (2021), ఓ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ (2023) దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్‌ వార్నరే. ఇప్పుడు టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో, ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల్లో మరికొన్ని రోజులు వార్నర్‌ను చూసే అవకాశముంది. వార్నర్‌ లోటును భర్తీ చేసే ఆటగాడి కోసం ఆస్ట్రేలియా వేట మొదలెట్టింది. 

ఈ ఆటగాళ్లు

వార్నర్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు కొందరున్నారు. వీళ్లపై ఆసీస్‌ కన్నేసింది. టెస్టుల్లో సీనియర్‌ స్మిత్‌ను ఓపెనర్‌గా ఆడించే అవకాశాలనూ కొట్టిపారేయలేం. ఇప్పటికే టీ20ల్లో స్మిత్‌ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. కానీ సాధారణంగా నాలుగో స్థానంలో ఆడే స్మిత్‌ను ఓపెనర్‌గా పంపించి జట్టు కూర్పును డిస్టర్బ్‌ చేయమని కెప్టెన్‌ కమిన్స్‌ అన్నాడు. లబుషేన్‌ను ఓపెనర్‌గా ఆడించి, గ్రీన్‌ను మిడిలార్డర్‌లోకి తీసుకుచ్చే ఆస్కారమూ ఉంది. లేదంటే గ్రీన్‌ను ఓపెనర్‌గానూ పరీక్షించొచ్చు. మరోవైపు మ్యాట్‌ రెన్‌షా, మార్కస్‌ హారిస్, కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌.. ఓపెనర్‌ రేసులో ఉన్నారు. ఆసీస్‌ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో 2021 జనవరి నుంచి ఓపెనర్లుగా బాన్‌క్రాఫ్ట్‌ 50.72 సగటుతో 2384 పరుగులు, రెన్‌షా 38.70 సగటుతో 658 పరుగులు, హారిస్‌ 37.68 సగటుతో 1545 పరుగులు చేశారు. అదే మొత్తం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చూసుకుంటే 43.04 సగటుతో హారిస్‌ ముందంజలో ఉన్నాడు. కానీ తన స్థానంలో రెన్‌షా ఆడితే చూడాలని ఉందని వార్నర్‌ పేర్కొన్నాడు. ఇక యువ ఆటగాడు విల్‌ పుకోవ్‌స్కీని పరిగణించే అవకాశముంది. మరి వార్నర్‌ ప్లేస్‌ను ఎవరు రీప్లేస్‌ చేస్తారో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని