David Warner: డేవిడ్ భాయ్ ఇన్‌స్టాలో ఫన్నీ.. గ్రౌండ్‌లో సీరియస్!

బ్యాటుతో బెంబేలెత్తించడం, ఫీల్డింగ్‌లో మెరుపులా కదలడం... మొత్తంగా మైదానంలో అతడో చిరుత. బౌలర్ వైపు నవ్వుతూ చూశాడా... ఆ తర్వాతి బంతి బౌండరీని ముద్దాడాల్సిందే. ఇదంతా క్రికెటర్ సైడ్. అతనికి ఇంకో సైడ్ కూడా ఉంది. అదే ఇన్‌స్టా సెలబ్రిటీ. గ్రౌండ్‌లో చిరుత అయితే... ఇక్కడ ‘స్టార్ హీరో’. ఇదంతా డేవిడ్ భాయ్ అలియాస్ డేవిడ్ వార్నర్ గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని షాకింగ్ న్యూస్ (వన్డేలకు రిటైర్‌మెంట్)తో స్టార్ట్ చేసిన వార్నర్ లైఫ్ రివైండ్ చేద్దామా?
2021 టీ20 ప్రపంచకప్ గుర్తుందా.. ఎక్కువ వన్డే ప్రపంచకప్‌లను గెలిచిన జట్టుగా ఉన్న ఆసీస్‌కు అప్పటి వరకు ఒక్కసారి కూడా పొట్టి కప్ దక్కలేదు. ఆ ఎడిషన్‌లోనూ పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగింది. చాలా మంది మాజీ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్‌ను ఆడించడం ఎందుకు? అనే ప్రశ్నలు.. అప్పుడు వార్నర్ పెద్దగా ఫామ్‌లో లేడు. అంతకుమందే ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 8 మ్యాచుల్లో 195 పరుగులే చేశాడు. కెప్టెన్సీ పోయింది. చివరికి తుది జట్టులోనూ స్థానం దక్కలేదు. ఇలాంటి అవమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రత్యర్థులు కూడా ‘వార్నర్ ఏం ఆడతాడులే’ అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ, ఆసీస్ జట్టు మాత్రం వార్నర్‌పై నమ్మకం ఉంచింది. ఆ వరల్డ్ కప్‌లో డేవిడ్ వార్నర్ విశ్వరూపం చూపించాడు. 7 మ్యాచుల్లో 289 పరుగులు చేసి.. రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్‌లోనూ కీలకమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌ను గెలవడంలోనూ ముఖ్యభూమిక పోషించిన వార్నర్ 11 మ్యాచుల్లో 535 పరుగులు చేశాడు. ఆరోసారి వరల్డ్ కప్‌ను నెగ్గిన తర్వాత వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలకడం సముచితంగా ఉంటుందని డేవిడ్ వార్నర్ తన ప్రకటనలో వెల్లడించాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి (2025లో) ఓపెనర్‌గా అవసరమైతే జట్టులోకి వచ్చేస్తానని చిన్న హింట్ ఇచ్చాడు.
అదే ఉత్సాహం..

తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ డేవిడ్ వార్నర్ ఆటతీరును చూస్తే అతడికి 37 ఏళ్లు ఉంటాయంటే ఎవరూ నమ్మలేరు. మైదానంలో చురుగ్గా ఉండే వార్నర్ వికెట్ల మధ్య పరుగు తీయడంలో కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గడు. టెస్టు కెరీర్‌కూ ముగింపు పలుకుతానని ఈ సిరీస్ ముందే ప్రకటించిన వార్నర్ తొలి మ్యాచ్‌లో పాక్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. భారీ సెంచరీ సాధించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టులోనూ సెంచరీ సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు, జట్టు సహచరులు వార్నర్ నుంచి ఆశిస్తున్నారు. దూకుడుగా ఆడే వార్నర్ టెస్టుల్లో ఎలా రాణించావని ఓ సందర్భంలో ప్రశ్నిస్తే.. ‘నువ్వు టీ20ల్లో కంటే టెస్టు క్రికెటర్‌గా అత్యుత్తమం’ అని సెహ్వాగ్ చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటానని వార్నర్ వెల్లడించాడు. పాక్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కూడా ‘సుదీర్ఘ ఫార్మాట్’లో ఫామ్‌లో లేడని విమర్శలు వచ్చాయి. కానీ, తొలి టెస్టులోనూ సెంచరీతో వారి నోళ్లు మూయించాడు.
ఆ ఒక్కటి దుమారం రేపింది..

డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 111 టెస్టులు ఆడాడు. పాకిస్థాన్‌తో చివరి మ్యాచ్ 112వ టెస్టు. 161 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. మొత్తం 18వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలున్నాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న డేవిడ్ వార్నర్ కెరీర్‌లో మాయని మచ్చ కూడా ఉంది. అదే 2018లో ‘బాల్ టాంపరింగ్ వివాదం’. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బాల్‌ను సాండ్ పేపర్‌తో రుద్దారనే అభియోగాలతో స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా.. వార్నర్‌పై వేటు కూడా పడింది. సంవత్సరం తర్వాత (2019) వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి మ్యాచ్‌లోనే అఫ్గాన్‌పై కీలక ఇన్నింగ్స్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు. కానీ, జాతీయ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టే అవకాశం మాత్రం ‘బాల్ టాంపరింగ్’తో చేజారింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగానూ ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌పై దురుసుగా ప్రవర్తించినందుకు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్నాడు. తన భార్య కార్డిస్ పట్ల దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ అసభ్యంగా మాట్లాడాడని ఆరోపణలతో అతడిపై వార్నర్ దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో ఐసీసీ అతడిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.
డేవిడ్ భాయ్.. ఐపీఎల్.. ఇన్‌స్టాగ్రామ్

ఆసీస్ తరఫున ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లాడినా.. భారత అభిమానులకు కూడా వార్నర్ దగ్గర కావడానికి రెండు కారణాలు. అవి ఐపీఎల్, ఇన్‌స్టాగ్రామ్. మరీ ముఖ్యంగా తెలుగు అభిమానులకు ‘డేవిడ్ భాయ్’గా గుర్తుండిపోతాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడినప్పుడు చాలా మంది అభిమానులు బాధపడ్డారు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల క్యారెక్టర్లను అనుకరిస్తూ కుటుంబంతో కలిసి ఇన్‌స్టా రీల్స్ రూపంలో దర్శనమిచ్చేవాడు. ‘పుష్ప’లో అల్లు అర్జున్, ‘పోకిరి’లో మహేశ్ డైలాగ్స్‌తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. తన కుమార్తెలు, భార్యతో కలిసి చేసిన వీడియోలను భారత అభిమానులు కూడా ఆదరించారు.
ఐపీఎల్‌లో (2016) సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వార్నర్ విజేతగా నిలిపాడు. గత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ సారథిగా డేవిడ్ వార్నర్‌ను చూశాం. వచ్చే ఎడిషన్‌లోనూ అదే దిల్లీ తరఫున బరిలోకి ఆడనున్నాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను మూడేళ్లపాటు అందుకున్నాడు. సారథ్య బాధ్యతలను రిషభ్ పంత్ (అందుబాటులోకి వస్తే) తీసుకుంటే వార్నర్ మరింత దూకుడుగా ఆడటం ఖాయం. ఇప్పటి వరకూ 176 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 6,397 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలున్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ డేవిడ్ వార్నర్. వన్డే రిటైర్‌మెంట్ తర్వాత చేసిన ప్రకటనలో.. లీగ్ క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడంతో అతడి నుంచి ఈసారి భారీ ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం లేకపోలేదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 


