David Warner: వార్నర్‌ తగ్గేదేలే.. ప్రపంచకప్‌లో అదరగొడుతున్న ఆసీస్‌ ఓపెనర్‌

Eenadu icon
By Sports News Team Published : 21 Oct 2023 13:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఫామ్‌ లేదు.. గాయాలు బాధిస్తున్నాయి.. పరుగులు చేయడం లేదు.. వయసు మీద పడుతోంది.. ఇక అతని పని అయిపోయిందని ఎన్నో వ్యాఖ్యలు. ఇంకా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ విమర్శలు. వీడ్కోలు పలికితే మంచిదనే ఉచిత సలహాలు. కానీ అతను కుంగిపోలేదు. ఎక్కడా ఆగిపోలేదు. విమర్శలనే ప్రేరణగా తీసుకుని కసిగా పరుగుల వేటలో సాగుతున్నాడు. ఫీనిక్స్‌ పక్షిలా ఎగిరాడు. అతనే.. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner). ఈ నెల 27న 37వ పడిలో అడుగుపెట్టనున్న ఈ విధ్వంసకర ఆటగాడు వన్నె తగ్గని బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌తోనే కెరీర్‌ ముగిసిందని.. టీ20ల్లోనూ వరస వైఫల్యాలున్నాయని.. వన్డేల్లోనూ భారీ ఇన్నింగ్స్‌ లేవని.. ఇలా వార్నర్‌పై ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వీటన్నింటికీ తన బ్యాటింగ్‌తోనే అతను సమాధానం చెబుతున్నాడు. 

ఆధునిక వన్డే క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న వార్నర్‌.. ఈ ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవేళ ఆటకు వీడ్కోలు పలికితే అది ఈ ప్రపంచకప్‌ తర్వాతే అని స్పష్టం కూడా చేశాడు. ఇప్పుడు టోర్నీలో అడుగుపెట్టడమే కాకుండా అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. నిరుడు 26 వన్డేల్లో 45 సగటుతో 1170 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 13 మ్యాచ్‌ల్లో 47.53 సగటుతో 618 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆ తర్వాత భారత్‌తో సిరీస్‌లో రాణించి సరిగ్గా ప్రపంచకప్‌ ముందు అతను జోరందుకున్నాడు. దక్షిణాఫ్రికాపై ఓ శతకం, అర్ధసెంచరీ సాధించాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు అర్ధశతకాలు బాదాడు. ఇప్పుడదే జోరును ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. భారత్‌పై 41 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా పాకిస్థాన్‌పై భారీ ఇన్నింగ్స్‌తో ఆ లోటు తీర్చేశాడు. క్రీజులో కుదురుకుంటే తానెంత ప్రమాదకర బ్యాటర్‌నోనని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. 

ప్రపంచకప్‌పై ప్రేమ..

ప్రపంచకప్‌ అంటే చాలు వార్నర్‌ చెలరేగిపోతాడు. ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు (19 ఇన్నింగ్స్‌) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయిదు శతకాలతో అత్యధిక ప్రపంచకప్‌ సెంచరీల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచి ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2015లో ఆస్ట్రేలియా వన్డే విశ్వవిజేతగా నిలిచిన టోర్నీలో వార్నర్‌ ఆసీస్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడి (8 మ్యాచ్‌ల్లో 345 పరుగులు)గా నిలిచాడు. ఆసీస్‌ సెమీస్‌లో నిష్క్రమించిన 2019 ప్రపంచకప్‌లోనూ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు (10 మ్యాచ్‌ల్లో 647 పరుగులు) అతడే. ఈ సారి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ప్రపంచకప్‌ను ఆసీస్‌ మొదలెట్టింది. గత మ్యాచ్‌లో లంకపై గెలిచింది. ఇప్పుడు పాకిస్థాన్‌పై వార్నర్‌ 163 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాదు.. మెగా టోర్నీలో మానసిక స్థైర్యాన్ని కూడా కలిగించాడనడంలో సందేహం లేదు. వార్నర్‌ ఒక్కసారి కుదురుకున్నారంటే అతని విధ్వంసానికి ఎంతటి బౌలరైనా బలి కావాల్సిందే. అన్ని రకాల షాట్లతో మైదానంలోని అన్ని వైపులా అలవోకగా షాట్లు ఆడేస్తాడు. సిక్సర్లు కొట్టేస్తాడు. వీర విహారం చేస్తూ బంతి అంతు చూస్తాడు.

పాకిస్థాన్‌ అంటే కూడా..

వార్నర్‌కు పాకిస్థాన్‌ ప్రియమైన ప్రత్యర్థి. వన్డేల్లో ఆ జట్టుపై వరుసగా నాలుగు శతకాలు బాదేశాడు. సవాళ్లను ఎదుర్కోవడం అతనికి ఇష్టం. అడ్డంకులను దాటి ముందుకు సాగడం అతని నైజం. ఎడమ చేతి వాటం బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడని అశ్విన్‌కు పేరుంది. అశ్విన్‌ బౌలింగ్‌లో వార్నర్‌ చాలా సార్లే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ ముందు భారత్‌తో సిరీస్‌లో మొహాలీలో రెండో వన్డేలో అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు అతను కుడి చేతి వాటం బ్యాటర్‌గా మారిపోయాడు. ఇలా ఎప్పటికప్పుడూ తనను తాను మెరుగుపర్చుకుంటూ.. తన ఆటతీరును మార్చుకుంటూ సాగుతున్నాడు. 2018 బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడు. భారత్‌లోని పిచ్‌లు అతనికి కొట్టిన పిండే. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం అతనికి ఉపయోగపడుతోంది. అలాగే వార్నర్‌ మనోడేనని అభిమానుల్లో ప్రేమ. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరపున ఆడటమే కాదు.. కెప్టెన్‌గా ట్రోఫీ అందించడమే కారణం. పైగా తెలుగు సినిమాల పాటలకు, డైలాగ్‌లకు వార్నర్‌ వీడియోలు చేస్తుంటాడు. మన హీరోల గెటప్పుల్లో తన ముఖంతో కనిపిస్తాడు. ఇప్పుడు పాకిస్థాన్‌పై సెంచరీ తర్వాత కూడా తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌లా సంజ్ఞ చేశాడు. ప్రపంచకప్‌లో ఇదే దూకుడుతో సాగుతానని చెప్పకనే చెప్పాడు. 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని