HCA: నేడు హెచ్‌సీఏ ఎన్నికలు

ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలోని దయానంద్ లాంజ్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలెట్టనున్నారు. అనంతరం గెలిచిన వాళ్లను ప్రకటిస్తారు. ఆరు పదవుల కోసం నాలుగు ప్యానెళ్లు ఎన్నికల బరిలో నిలిచాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవుల కోసం వరుసగా శివలాల్ యాదవ్- అర్షద్ అయూబ్ గ్రూప్ నుంచి అమర్‌నాథ్, శ్రీనివాస రావు, దేవరాజ్, చిట్టి శ్రీధర్, సంజీవ్‌రెడ్డి, సునీల్ కుమార్.. ప్యానెల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి అనిల్ కుమార్, దల్జీత్ సింగ్, ఆగం రావు, బసవరాజు, మహేంద్ర, వినోద్.. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి జగన్‌మోహన్ రావు, పి.శ్రీధర్, హరినారాయణ రావు, నోయల్ డేవిడ్, శ్రీనివాస్ రావు, అన్సార్ అహ్మద్ ఖాన్.. హెచ్‌హెచ్‌హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి పీఎల్ శ్రీనివాస్, బాబురావు, భాస్కర్, సతీష్ చంద్ర, జెరార్డ్, డీఏజే వాల్టర్ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో క్లబ్‌లు, ఇన్‌స్టిట్యూషన్ల నుంచి 149 మంది, జిల్లా సంఘాల నుంచి 9 మంది, అంతర్జాతీయ క్రికెటర్ల కోటాలో 15 మంది కలిపి మొత్తం 173 మందికి ఓటు వేసే హక్కు కల్పించారు.
లంక జట్టులో మాథ్యూస్, చమీర
దిల్లీ: శ్రీలంక జట్టును గాయాలు వెంటాడుతున్న నేపథ్యంలో వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్, పేసర్ దుష్మంత చమీరలను శ్రీలంక క్రికెట్ బోర్డు రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. వీరిద్దరు శుక్రవారం లఖ్‌నవూలో జట్టుతో కలవనున్నారు. గాయం కారణంగా ఇప్పటికే కెప్టెన్ శానక జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంకెవరికైనా గాయమైతే వెంటనే జట్టులోకి తీసుకొచ్చేందుకు వీలుగా మాథ్యూస్, చమీరలను ఎంపిక చేశారు. ఈ ఏడాది జూన్‌లో అఫ్గానిస్థాన్‌పై మాథ్యూస్, చమీర చివరిగా వన్డే ఆడారు. 36 ఏళ్ల మాథ్యూస్ 221 వన్డేలు, చమీర 44 వన్డేలు ఆడారు. అక్టోబర్ 21న లఖ్‌నవూలో నెదర్లాండ్స్‌తో లంక తలపడనుంది.
క్వార్టర్స్‌లో సింధు

ఒడెన్స్: ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు డెన్మార్క్ ఓపెన్లో క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 18-21, 21-15, 21-13తో మరిస్కా టన్‌జుంగ్ (ఇండోనేషియా)ను ఓడించింది. తొలి గేమ్ కోల్పోయినా.. ఆ తర్వాత గొప్పగా పుంజుకున్న ఈ భారత స్టార్ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది.
వచ్చే ఏడాదీ హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ
దిల్లీ: 2023లో హైదరాబాద్ అభిమానులను అలరించిన ఫార్ములా-ఈ సిరీస్ మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానుంది. వచ్చే ఏడాది నగరం ఫార్ములా-ఈ రేసుకు వేదికగా నిలవనుంది. 2024 ఫిబ్రవరి 10న ఈ రేసు జరగనుంది. ఫార్ములా-ఇ సీజన్-10కు ఆతిథ్య నగరాలుగా హైదరాబాద్‌తో పాటు షాంగై కూడా ఎంపికైంది.
ఆసియా ఆర్చరీకి సురేఖ
సోనిపట్: బ్యాంకాక్‌లో నవంబర్ 3న మొదలయ్యే ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో వెన్నం జ్యోతి సురేఖ చోటు దక్కించుకుంది. సెలక్షన్ ట్రయల్స్‌లో కాంపౌండ్‌లో సత్తా చాటిన ఆమె ఈ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే అవకాశాన్ని పొందింది. రికర్వ్ బృందంలో తెలుగుతేజం బొమ్మదేవర ధీరజ్ చోటు సంపాదించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఇది అర్హత టోర్నీ కూడా.
హైదరాబాద్ హ్యాట్రిక్
జైపుర్: రవితేజ (6/13) విజృంభించడంతో ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం సాధించింది. గురువారం గ్రూప్-ఏ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మొదట రవితేజ ధాటికి చత్తీస్‌గఢ్ 19.1 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యాన్ని హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌సింగ్ (25 నాటౌట్), చందన్ (25), తన్మయ్ (21) రాణించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








