David Warner: వార్నర్‌.. టెస్టుల్లో చివరిగా!

Eenadu icon
By Sports News Desk Updated : 04 Dec 2023 05:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు చోటు

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు వార్నర్‌ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో అతనికి చోటు దక్కింది. ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ అతను ఆడితే.. వచ్చే నెల 3 నుంచి జరిగే సిడ్నీ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశముంది. తన సొంతగడ్డ అయిన సిడ్నీలో టెస్టులకు వీడ్కోలు పలకాలనే ఆశను గతంలో వార్నర్‌ వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. 2019లో పాకిస్థాన్‌పై త్రిశతకం తర్వాత టెస్టుల్లో వార్నర్‌ ఫామ్‌ అంత గొప్పగా ఏం లేదు. ఆ తర్వాత ఆడిన టెస్టుల్లో అతను 28 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే టెస్టులకు సిడ్నీలో గుడ్‌బై చెప్పాలని 37 ఏళ్ల వార్నర్‌ ఆశపడుతున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్‌ (కెప్టెన్‌), బోలాండ్‌, కేరీ, గ్రీన్‌, హేజిల్‌వుడ్‌, హెడ్‌, ఖవాజా, లబుషేన్‌, లైయన్‌, మిచెల్‌ మార్ష్‌, లాన్స్‌ మోరిస్‌, స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌.

ఘన వీడ్కోలు ఎందుకు: సిడ్నీలో చివరి టెస్టు ఆడాలని ఉందని వార్నర్‌ బహిరంగంగా చెప్పడం పట్ల ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. 2018లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా బాల్‌టాంపరింగ్‌ను ఉద్దేశిస్తూ వార్నర్‌కు ఎందుకు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్రశ్నించాడు. ‘‘వార్నర్‌ వీడ్కోలు సిరీస్‌ కోసం అంతా సిద్ధమవుతోంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో దయచేసి ఎవరైనా చెప్పగలరా? ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓ టెస్టు ఓపెనర్‌ తానే స్వయంగా రిటైర్మెంట్‌ తేదీ ప్రకటించుకునే అవకాశం ఇవ్వడం ఏమిటి? ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంలో కేంద్ర బిందువైన ఓ ఆటగాడికి హీరో తరహా వీడ్కోలు ఎందుకు? ఆ బాల్‌టాంపరింగ్‌ వివాదంలో వార్నర్‌తో పాటు ఇతర ఆటగాళ్లూ ఉన్నప్పటికీ సీనియర్‌ ఆటగాడిగా, నాయకుడిగా అతను అలా వ్యవహరించాల్సింది కాదు. ఇప్పుడూ అతను బయటకు వెళ్లే దారి అదే అహంకారం, దేశం పట్ల అగౌరవం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది’’ అని ఓ స్థానిక వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో జాన్సన్‌ పేర్కొన్నాడు.

Tags :
Published : 04 Dec 2023 03:00 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని