పాక్‌లో పర్యటన కష్టమే

ఆసియా కప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా పర్యటనపై నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖదేనని క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అయితే పాక్‌లో భారత్‌ పర్యటన అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు పాక్‌ వస్తుందని ఠాకూర్‌ ఆశాభావం వ్యక్తంజేశాడు

Published : 21 Oct 2022 03:06 IST

దిల్లీ: ఆసియా కప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా పర్యటనపై నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖదేనని క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అయితే పాక్‌లో భారత్‌ పర్యటన అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు పాక్‌ వస్తుందని ఠాకూర్‌ ఆశాభావం వ్యక్తంజేశాడు. ‘‘ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అన్ని జట్లను ఆహ్వానించారు. చాలాసార్లు పాక్‌ జట్లు భారత్‌కు వచ్చాయి.. ఆడాయి. భారత్‌ను శాసించే స్థితిలో ఎవరూ లేరని భావిస్తున్నా. అలా చేసేందుకు ఎవరి దగ్గర కారణం కూడా లేదు. అన్ని దేశాలు వచ్చి పోటీపడతాయని ఆశిస్తున్నా. పాకిస్థాన్‌లో ఆసియా కప్‌ కోసం భారత్‌ వెళ్లదని చెప్పడం లేదు. ఏదైనా జరగొచ్చు. అయితే ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై హోం శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఆటగాళ్ల భద్రతే అత్యంత ముఖ్యం’’ అని ఠాకూర్‌ వివరించారు. మరోవైపు పాక్‌లో పర్యటనపై బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకోలేదని నూతన అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ తెలిపాడు. ‘‘ఆ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు. దేశాన్ని వీడాలంటే ప్రభుత్వం అనుమతి కావాలి. విదేశాలకు వెళ్లాలన్నా.. ఇతర జట్లు భారత్‌కు రావాలన్నా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే మేం ముందుకెళ్తాం. మేం సొంతంగా నిర్ణయాలు తీసుకోలేం. ప్రభుత్వంపై ఆధారపడాలి. మేమింకా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు’’ అని బిన్నీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని