Warner - Cape Town Pitch: ‘వార్నర్‌ గొప్ప క్రికెటర్‌ కాదు’.. కేప్‌టౌన్‌ పిచ్‌ రేటింగ్ ఎంతంటే?

Eenadu icon
By Sports News Team Published : 09 Jan 2024 19:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ (David Warner)పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కోచ్‌ జాన్‌ బుకానన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌పై ప్రశంసలు కురిపిస్తూనే అతడు గొప్ప క్రికెటరేం కాదని,  ‘గ్రేట్ ఆఫ్ ది గేమ్’గా పరిగణించలేమని వ్యాఖ్యానించాడు.  ‘‘అంతర్జాతీయ కెరీర్‌లో వార్నర్ అద్భుతంగా ఆడాడు. 100కి పైగా టెస్టులు ఆడి 8000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 160 కంటే ఎక్కువ వన్డేలు, దాదాపు 100 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో తనదైన ముద్ర వేశాడు. ఇతరులతో పోలిస్తే బ్యాటింగ్ సగటు, స్ట్రైక్‌రేట్‌ మెరుగ్గా ఉన్నాయి. కానీ, క్రికెట్‌లో గ్రేట్ అనిపించుకోవాలంటే అతడు సాధించిన రికార్డుల దరిదాపుల్లోకి ఎవరూ రాకూడదు. బ్రాడ్‌మన్‌, మెక్‌గ్రాత్‌, షేన్‌వార్న్‌ మాత్రమే గ్రేట్ అని నా అభిప్రాయం. వార్నర్‌ ఆ జాబితాలో లేడు’’ అని బుకానన్‌ అన్నాడు.


కేప్‌టౌన్‌ పిచ్‌ రేటింగ్‌ ఎంతంటే?

ఇటీవల కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరిగిన రెండో టెస్టు ఒకటిన్నర రోజులోనే ముగిసింది. 107 ఓవర్లలోనే మ్యాచ్‌లో విజేత ఎవరో తేలింది. టెస్టు క్రికెట్‌లో తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌ ఇదే. తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. పిచ్‌ తయారీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ పిచ్‌కు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ‘అసంతృప్తికరం’ అని రేటింగ్‌ ఇచ్చాడు. అంతేకాదు, ఒక డీమెరిట్‌ పాయింట్‌ కేటాయించారు. ‘‘న్యూలాండ్స్‌లోని పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మ్యాచ్ అంతటా బంతి వేగంగా వచ్చి, కొన్నిసార్లు భయంకరంగా బౌన్స్ అయింది.  షాట్లు ఆడడం కష్టమైంది. చాలా మంది బ్యాటర్ల గ్లవ్స్‌కు బంతి తగిలింది. అస్థిర బౌన్స్‌తో ఎక్కువ వికెట్లు పడ్డాయి’’ అని మ్యాచ్‌ రిఫరీ వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు