NZ vs IND: వన్డే ప్రపంచకప్‌పై గురించి ఆలోచించడం లేదు: శుభ్‌మన్‌ గిల్‌

తాను 2023 వన్డే ప్రపంచకప్‌ గురించి ఆలోచించడం లేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టుకు సహకారం అందించడంపై తృష్టి సారించానని టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ పేర్కొన్నాడు.

Updated : 14 Dec 2022 11:19 IST

ఇంటర్నెట్ డెస్క్: తాను 2023 వన్డే ప్రపంచకప్‌ గురించి ఆలోచించడం లేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టుకు సహకారం అందించడంపై దృష్టి సారించానని టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ పేర్కొన్నాడు. గిల్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్‌ (50) అర్ధ శతకంతో రాణించగా.. వర్షం కారణంగా రద్దయిన రెండో వన్డేలో 45 పరుగులు చేశాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం గిల్‌ని టాప్‌ ఆర్డర్‌లో ఆడిస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ఓపెనర్‌ స్థానం కోసం కేఎల్ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ వంటి ఆటగాళ్లతో గిల్‌ గట్టిపోటీని ఎదుర్కొంటున్నాడు. అయితే, ప్రపంచ కప్‌ అవకాశాల గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని ఈ యువ బ్యాటర్ వెల్లడించాడు.    

‘నిజంగా నేను అంత దూరం (ప్రపంచకప్ గురించి) ఆలోచించడం లేదు. ఇప్పుడు నా దృష్టంతా నాకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే ఉంది. ఈ సిరీస్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నా. భారీ స్కోరులు చేసి జట్టుకు మంచి సహకారం అందించడానికి ప్రయత్నిస్తున్నా’ అని గిల్ వివరించాడు. 
సీనియర్ జాతీయ జట్టుకు ఎంపిక కానప్పుడు లేదా విరామం ఇచ్చినప్పుడు ఆ ఖాళీ సమయాన్ని నైపుణ్యాలను పెంచుకోవడం కోసం దేశవాళీ క్రికెట్ ఆడతానని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని