Bhatti Vikramarka: అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు కల్పించవద్దనే కుట్ర కనిపిస్తోంది: భట్టి విక్రమార్క

Eenadu icon
By Telangana News Team Updated : 30 Oct 2025 17:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ భాజపా నేతలు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)ను ఆశ్రయించడాన్ని కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. ఇందులో అజారుద్దీన్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించవద్దనే కుట్ర కనిపిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అజారుద్దీన్‌ హైదరాబాద్‌ బిడ్డ అని, మన కీర్తిపతాకలను రెపరెపలాడించిన వ్యక్తి అని పేర్కొన్నారు.

‘‘అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన క్రీడాకారుడాయన. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలి. కానీ.. మంత్రివర్గంలోకి తీసుకోవద్దని లేఖ రాయడం దురదృష్టకరం. భారత రాష్ట్ర సమితిని గెలిపించడంలో భాగంగానే భాజపా నేతలు లేఖ రాశారు. పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు భారాస సహకరించింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో భాజపా ఎలాగూ గెలవదు కాబట్టి బలహీన వ్యక్తిని నిలబెట్టింది. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోకుండా గవర్నర్‌పైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో అన్నారు.

భాజపాది ద్వంద్వ వైఖరి.. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

నాడు భారత క్రికెట్‌ జట్టుకు అజారుద్దీన్‌ సేవలందించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గుర్తుచేశారు. ‘‘అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మైనార్టీకి అవకాశమిస్తే అడ్డుతగిలేలా విషం వెళ్లగక్కుతున్నారు. ఈసీ వద్ద ఆపాలని భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. గొప్ప క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం వస్తుంటే అనైతికంగా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. మైనార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కేబినెట్‌లో అవకాశం ఆలస్యమైంది. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా మైనార్టీలకు సంక్షేమానికి పాటుపడుతున్నాం. భాజపా ద్వంద్వ వైఖరిని ప్రజలు తెలుసుకోవాలి. ఎన్నికల వేళ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్‌లో ఉపఎన్నిక వేళ భాజపా అభ్యర్థిని మంత్రిగా చేశారు. భాజపాకు రాజస్థాన్‌లో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతి ఉంటుందా?’’ అని ప్రశ్నించారు.

Tags :
Published : 30 Oct 2025 17:02 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు