JEE Main: మరింత చేరువగా జేఈఈ మెయిన్‌

Eenadu icon
By Telangana News Desk Updated : 02 Nov 2025 04:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈసారి భారీగా పెరిగిన పరీక్ష నిర్వహణ ప్రాంతాలు
ఏపీలో 8 చోట్ల.. తెలంగాణలో 3 ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు
దరఖాస్తు ప్రక్రియకు ఈ నెల 27 తుది గడువు
వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగించుకునేందుకు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/బీఆర్క్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పొందేందుకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌-2026 ఈసారి విద్యార్థులకు మరింత చేరువ కానుంది. పరీక్ష నిర్వహించే పట్టణాలు/నగరాల సంఖ్య భారీగా పెంచారు. ఏపీలో 8, తెలంగాణలో 3 పట్టణాలను అదనంగా చేర్చారు. దాదాపు 14 లక్షల మంది పరీక్షలు రాస్తుండగా...ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తున్న జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఈసారి మరిన్ని ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంస్థ... పూర్తి సమాచారంతో ఇన్‌ఫర్మేషన్‌ బులిటెన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈసారి వర్చువల్‌ కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చు. అది కంప్యూటర్‌పైనే ఉంటుంది. దానివల్ల విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని జేఈఈ నిపుణుడు, శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ సమన్వయకర్త ఉమాశంకర్‌ తెలిపారు. అంతేకాకుండా కంప్యూటర్‌పై కనిపించే ప్రశ్నపత్రం ఫాంట్‌ సైజు, ఆయా చిత్రాలను పెంచుకొని చదువుకునేందుకు...చూసుకునేందుకు అవకాశం ఇస్తున్నారని చెప్పారు.

మారని ఎన్‌టీఏ తీరు...

శుక్రవారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎన్‌టీఏ...అదే రోజు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు పేర్కొనడం గమనార్హం. అక్టోబరులోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పుకొనేందుకు అర్ధరాత్రి నోటిఫికేషన్‌ ఇచ్చిందని భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ జారీ నుంచి ఫలితాల వరకు అన్నీ అర్ధరాత్రిళ్లు ప్రకటిస్తూ విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం ఎన్‌టీఏకు అలవాటైపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

చివరి విడతకు...

  • జనవరి ఆఖరి వారంలో దరఖాస్తుల స్వీకరణ  మొదలవుతుంది. 
  • ఏప్రిల్‌ 2 నుంచి 9వ తేదీ మధ్య పరీక్షలు జరుగుతాయి. 
  • తుది ఫలితాలు ఏప్రిల్‌ 20వ తేదీ నాటికి వెల్లడిస్తారు.

పరీక్ష నిర్వహించే ప్రాంతాలు...

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం.. ఇవన్నీ గత ఏడాది వరకు ఉన్నవి. ఈసారి ఆదిలాబాద్, పెద్దపల్లి, కోదాడ కొత్తగా చేరాయి. మొత్తం 14 ప్రాంతాలు.

ఇవీ ముఖ్యాంశాలు...

  • 2024, 2025తోపాటు వచ్చే మార్చిలో జరిగే ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జేఈఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9-12 వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు నిర్వహిస్తారు.
  • పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్‌-1 300 మార్కులకు, పేపర్‌-2 400 మార్కులకు ఉంటుంది.

తొలి విడతకు షెడ్యూల్‌ ఇలా...

దరఖాస్తులు: నవంబరు 27 వరకు
పరీక్ష రాసే ప్రాంతంపై స్పష్టత: జనవరి మొదటి వారం నాటికి
హాల్‌టికెట్లు: తర్వాత ప్రకటిస్తారు
పరీక్షలు: జనవరి 21 - 30 మధ్య
ఫలితాల విడుదల: ఫిబ్రవరి 12 నాటికి

Tags :
Published : 02 Nov 2025 04:11 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని