Rythu Bharosa: రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి
అప్పుడే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం
9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు జమ చేస్తాం
గత ప్రభుత్వానిది ఆర్థిక విధ్వంసం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
రైతునేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి ‘భరోసా’ నిధులను విడుదల చేసిన సీఎం

అన్నదాతలతో ముఖాముఖి సందర్భంగా రైతు దంపతులు
వెంకటరామయ్య, లక్ష్మమ్మలను అభినందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
చిక్కుముళ్లు, సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుంటే... కొంత సమయం ఇద్దామన్న కనీస ఇంగితం లేకుండా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాన్ని సరిదిద్దే అవకాశమివ్వకుండా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు. నేనేమైనా ఫాంహౌస్‌లో పడుకున్నానా? నేను, మంత్రులు రోజూ అందర్నీ కలుస్తున్నాం. గతంలో సీఎం ఎన్నిసార్లు బయట తిరిగారు... సచివాలయానికి వచ్చారో లెక్కలు తీయాలి. ప్రజలంతా అప్పటి, ప్రస్తుత పరిపాలనను పోల్చిచూడాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. చిత్రంలో వీర్లపల్లి శంకర్,
మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల
నాగేశ్వరరావు, రామకృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, జి.వివేక్, కోదండరెడ్డి తదితరులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రం మరో వందేళ్లయినా కోలుకోనివిధంగా గత భారాస ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షాలు సంతోషంతో నృత్యాలు చేస్తున్నాయని, వారి చావులపై అధికారంలోకి రావచ్చన్న దురాశతో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో రైతుభరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల్లో 1.49 కోట్ల ఎకరాలకు... 70.11 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలో నం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని అన్నారు. రైతుల పెట్టుబడికి రెండింతల లాభం వచ్చినపుడే రానున్న పదేళ్లలో రాష్ట్రం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని... రైతుభరోసా నిధుల విడుదలను బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైతుల ఆశీర్వాదం ఉంటేనే అధికారం
‘‘రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబీమా, సన్న ధాన్యానికి బోనస్ కింద గడిచిన 18 నెలల్లో రైతుల కోసం ప్రభుత్వం రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. భారాస హయాంలో రుణమాఫీ ఎంత జరిగింది? ఏడాదిలో మేం ఎంత మాఫీ చేశామో గ్రామాల్లో చర్చలు పెడతాం. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు ఐకేపీ కేంద్రాలు తెరవలేదు. మేం 8 వేల కేంద్రాలు తెరిచి, 48 గంటల్లో నగదు బదిలీ చేయడంతోపాటు బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం ధరణి పేరిట దోపిడీ చేస్తే.. భూభారతితో పొంగులేటి అండగా ఉన్నారు. గతంలో ప్రభుత్వాన్ని నడిపినవాళ్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏర్పాటై 18 నెలలు తిరగకముందే నిందిస్తూ... వీధి నాటకాలతో బయలుదేరారు. వారు 2014లో రూ.లక్ష రుణమాఫీని నాలుగు విడతల్లో చేస్తే అసలుకు వడ్డీలు పెరిగాయి తప్ప రైతులకు ఏమీ మిగల్లేదు. 2018లో ఒకేసారి చేస్తామని చెప్పి ఐదేళ్ల తర్వాత రూ.11,500 కోట్లు రుణమాఫీ చేశారు. వాటిలో రూ.8,500 కోట్లు వడ్డీకి సరిపోయాయి. గత ప్రభుత్వం రెండు విడతల్లో చేసిన రుణమాఫీ రూ.16-17 వేల కోట్లకు మించలేదు. మా ప్రభుత్వానికి తొలి ఏడాదిలో ఎన్నో ఇబ్బందులున్నా ఒకేసారి రుణమాఫీ చేశాం.
పేదల కడుపు నింపుతున్న సన్న బియ్యం
రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంటున్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సన్న వడ్లు పండించాలని, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని రైతులకు విజ్ఞప్తి చేశాం. దీంతో గత వానాకాలం సీజన్‌లో 60 శాతం సన్న వడ్లు పండించారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం పేదల కడుపు నింపుతోంది. రైతుల పంటలు కొనుగోలు చేస్తే రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని, ప్రభుత్వం సత్రం నడపడం లేదని అప్పటి సీఎం అన్నారు. వరి వేస్తే ఉరివేసుకున్నట్లేనన్నారు. స్వయంగా తన 150 ఎకరాల్లో వడ్లు పండించి క్వింటాలుకు రూ.4,200 చొప్పున విక్రయించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వరి పండిస్తే ప్రభుత్వమే కొంటుందని మేం చెప్పాం. దీంతో 2.2 లక్షల టన్నుల వడ్లు పండించి దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. సన్న వడ్లు పండించడంలోనూ అగ్రస్థానం మనదే. ఇంతకన్నా రైతుల కళ్లలో ఆనందం ఏముంటుంది?
రూ.8.29 లక్షల అప్పులు మోపారు..
బిల్లులు రాలేదని మాజీ సర్పంచులు అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చేనాటికి వారి పదవీకాలం ముగిసిపోయింది. గత ప్రభుత్వం రూ.1.29 లక్షల కోట్ల బిల్లులను చెల్లించలేదు. ఇందులో రూ.60 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి కాగా... రూ.20 వేల కోట్లు ఉచిత విద్యుత్తు బిల్లులవి. గత ప్రభుత్వం రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకే రూ.12 వేల కోట్ల బకాయి పెట్టింది. రూ.8.29 లక్షల కోట్ల అప్పు మిగిల్చి ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు రోజుకు 18 గంటలు పనిచేసినా సరిపోని పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి అమలు కష్టంగా ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి.
4 కోట్ల మందికి స్వేచ్ఛ వచ్చింది...
ట్యాపింగ్ కారణంగా గతంలో భార్యాభర్తలు ఫోన్‌లో మాట్లాడుకోవాలన్నా భయపడే పరిస్థితులుండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేశాం. మా ప్రభుత్వంలో ఐదుగురు ఎస్సీలు మంత్రులు, స్పీకర్‌గా ఉన్నారు. గతంలో ఉన్నది ఒక్కరే. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. సివిల్స్ చదివే రైతుల పిల్లలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం.
రైతులకు ఏఐపై అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీలు, భూములు ఇచ్చినట్టు... రైతులకు సబ్సిడీ ఇవ్వడంతోపాటు ఏఐపై అవగాహన కల్పించాలి. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించి, వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తాం. కుటుంబంలో నలుగురు ఉంటే.. ఒకరు వ్యవసాయం, ఒకరు ఇంటి పనులు, ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేస్తే ఆర్థికంగా నిలబడుతుంది. రైతులకు ఏటా రూ.17 వేల కోట్ల విలువైన ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. వారందరూ సౌర విద్యుత్‌కు మారితే అదనంగా నెలకు రూ.2-3 వేల ఆదాయం వచ్చేలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు ఇంటివద్ద కూర్చున్నా ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని, సోలార్ పంపుసెట్లతో ప్రయోజనంపై వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నా. ఏ భూమిలో ఏయే రకాల పంటలు, పండ్లు, కూరగాయలు వేయాలన్న విషయమై రైతులకు అవగాహన కల్పించాలి. అనుభవమున్నవారితో సదస్సులు నిర్వహించాలి. వారికి రోజుకు రూ.వెయ్యి గౌరవ భత్యం ఇవ్వాలి. కొడంగల్, తాండూరులలో కందిపప్పు, అచ్చంపేటలో దోసకాయలు పండుతాయి. దోసకాయ, కందిపప్పుతో వండిన కూరతో జొన్న రొట్టె తింటే చాలా బాగుండేది. ఇప్పుడు ఆ రుచులు పోయాయి. ఇప్పుడు తింటున్న మిల్లెట్స్ మన తాతముత్తాతలు తిన్నవి కాదా? జిమ్‌లకు వెళ్లి, స్టెరాయిడ్‌లు తీసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. జొన్నరొట్టెలు తిని.. ఎవరి దుస్తులు వారు ఉతుక్కుంటే సిక్స్‌ప్యాక్ వస్తుంది.
ఊర్లో ఇల్లు, పొలం రైతుకు గౌరవం..
ఊర్లో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంటే రైతులకు ఆత్మగౌరవం. రాష్ట్రంలో రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు పంట మార్పిడి చేయాలి. ఏ పంట పండించినా కొంటాం. ప్రభుత్వంలో మంత్రులతో మంచి జట్టు ఉంది. అనుభవమున్నవారు ఉన్నారు. అందరి సహకారంతో మంచి పరిపాలన అందిస్తాం. ప్రతిపక్షాలు ఎంత గోల పెట్టినా, ధర్నాలు చేసినా పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నవారు రైతుభరోసా, గిట్టుబాటు ధర, సర్పంచుల బిల్లులు ఎందుకు చెల్లించలేదు? ప్రతిపక్షాల తిట్లన్నీ మాకు ఆశీర్వాదం అవుతాయి. నేను ప్రజాసంక్షేమం కోసమే పనిచేస్తా. ఇక రైతులు, యువత ప్రతిపక్షాల పనిపట్టాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


