Manuguru BRS Office: భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 04:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

మణుగూరులో ఉద్రిక్తత

ఫర్నిచర్‌ని బయట పడేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

మణుగూరు పట్టణం, మణుగూరు సాంస్కృతికం- న్యూస్‌టుడే: భద్రాద్రి జిల్లా మణుగూరులో కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉదయం పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలోకి భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులు ప్రవేశించారు. అందులోని కరపత్రాలు, డైరీలు, జెండాలు, ఫర్నిచర్, కంప్యూటర్‌ బయటకు తీసుకొచ్చి నిప్పుపెట్టారు. అనంతరం నినాదాలు చేస్తూ కార్యాలయంపై ఉన్న ‘తెలంగాణ భవన్‌’ అనే పేరును చెరిపేసి దానిపై ‘ఇందిరమ్మ భవన్‌’ అని రాశారు. అక్కడ కాంగ్రెస్‌ జెండాలను ఎగురవేసి ‘ఇందిరమ్మ భవన్‌’ అనే ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కార్యకర్త శ్రీనుపై దాడికి పాల్పడటంతో ఆయన కంటికి గాయమైంది. అనంతరం కాంగ్రెస్‌ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకొంటుండగా అక్కడికి భారీగా చేరుకున్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొత్తగూడెం ఓఎస్డీ నరేందర్, డీఎస్పీ రవీంద్రారెడ్డి ప్రత్యేక బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రజల రక్షణార్థం 144 సెక్షన్‌ విధిస్తూ తహసీల్దార్‌ నరేశ్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇరుపార్టీల వారు నిష్క్రమించారు. 

నా సొంత భవనం: రేగా కాంతారావు 

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సాయంత్రం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాట్లాడారు. ‘భారత రాష్ట్ర సమితి కార్యాలయం నా సొంత భవనం. కాంగ్రెస్‌ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాపై దాడులకు కుట్ర పన్నారు. డీఎంఎఫ్‌ (డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌) నిధుల లెక్క చెప్పాలని ప్రశ్నించినందుకే కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీసు వారిదని ఆధారాలు చూపిస్తే ఖాళీ చేసేందుకు సిద్ధం’ అని తెలిపారు. ఈ ఘటనపై మణుగూరు డీఎస్పీ రవీంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.

పార్టీ కార్యాలయంపై ఇందిరమ్మ భవన్‌ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

అది కాంగ్రెస్‌ కార్యాలయమే: పాయం వెంకటేశ్వర్లు 

ఇదే విషయమై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడారు. ‘లేని ఆరోపణలు చేస్తే రేగా కాంతారావుకు గుణపాఠం చెబుతాం. గతంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు డబ్బు జమచేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంతో పాటు, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరి.. కార్యాలయాన్ని కబ్జా చేశారు. మా శ్రేణులు స్వాధీనం చేసుకునే క్రమంలో.. భారత రాష్ట్ర సమితి నాయకులు దుర్భాషలాడటంతో వివాదం నెలకొంది. రేగా ఆరోపణలు అవాస్తవం. నూటికి నూరుశాతం ఇది కాంగ్రెస్‌ కార్యాలయం’ అని స్పష్టం చేశారు.


దాడులకు భయపడేది లేదు: కేటీఆర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: మణుగూరు భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై దాడి ఘటనను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. వీటికి ముగింపు పలికే సమయం తొందరలోనే ఉంది. మణుగూరు పార్టీ శ్రేణులకు 60 లక్షల మంది భారత రాష్ట్ర సమితి సభ్యులు అండగా ఉంటారు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేగా కాంతారావుతో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. 

ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వస్తున్న అసంతృప్తిని చూసి.. ఆ పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిందని భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రేగా కాంతారావు ప్రైవేటు ఆస్తిని కొనుక్కుని పార్టీ ఆఫీసుగా మార్చుకున్నారు. దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు