Dasarathi Krishnamacharya Award: తొవ్వపొంట పొక్కిలి వాకిళ్ల పులకరింత!
అన్నవరం దేవేందర్‌కు శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డు

ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. రవీంద్రభారతిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో దేవేందర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అవార్డును బహూకరిస్తారు. అవార్డుతోపాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, శాలువను అందజేస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో దశరథం, కేదారమ్మలకు అన్నవరం దేవేందర్ 1962 అక్టోబరు 17న జన్మించారు. ఆయన సతీమణి రాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమె స్వయంగా కథా రచయిత్రి. సోదరుడు శ్రీనివాస్ ప్రఖ్యాత చిత్రకారుడు. సోదరి నాంపల్లి సుజాత ప్రముఖ కవయిత్రి. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన దేవేందర్ ప్రస్తుతం కరీంనగర్‌లో నివసిస్తున్నారు. 1985 నుంచి కొంతకాలం వివిధ దినపత్రికల్లో పాత్రికేయునిగా పనిచేశారు. 2015 నుంచి వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. తొవ్వ, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, బొడ్డు మల్లె చెట్టు, పొద్దుపొడుపు, పొక్కిలి వాకిళ్ల పులకరింత, బువ్వకుండ, ఇంటి దీపం, వరి గొలుసులు, గవాయి, జీవన తాత్పర్యం వంటి కవితా సంపుటిలు రాశారు. ఆంగ్లంలోనూ మూడు కవితా సంపుటిలు వెలువడ్డాయి. మరో కోణం(సామాజిక వ్యాసాలు), ఊరి దస్తూరి-2020(తెలంగాణ సాంస్కృతిక చిత్రణ, కాలమ్స్), సంచారం(యాత్రా వ్యాసాలు), అంతరంగం(వర్తమాన జీవన చిత్రణ) పుస్తకాలను రచించారు. ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’ కవిత కాకతీయ వర్సిటీలో బీఏ స్పెషల్ తెలుగు విద్యార్థులకు పాఠంగా ఉంది. దేవేందర్‌ను ఇప్పటివరకు వివిధ సంస్థల ద్వారా 31 పురస్కారాలు వరించాయి. దాశరథి అవార్డుకు ఎంపికైన కవి దేవేందర్‌కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
అక్షరాన్నే ఆయుధంగా మలచిన మహనీయుడు దాశరథి: సీఎం
‘‘తెలంగాణ సాయుధ పోరాటంలో అక్షరాన్నే ఆయుధంగా మలచి, నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా తెలంగాణకు, సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను సోమవారం ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ‘‘పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడు. ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రభుత్వం ఘనంగా సన్మానిస్తోంది. వారికి చేయూతను అందిస్తోంది. ప్రతి ఏడాది దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రకటించే అవార్డును 2025 సంవత్సరానికి కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది’’ అని సీఎం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






