Bhatti Vikramarka: సీఎం రమ్మన్నది కేసీఆర్‌ని.. రావాల్సింది అసెంబ్లీకి

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Jul 2025 06:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు, చవాకులు
కేటీఆర్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజం
మహబూబాబాద్‌ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కేసముద్రంలో అభివృద్ధి పనుల శిలాఫలకం ఆవిష్కరణలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
చిత్రంలో కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మురళీనాయక్, 
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రామచంద్రునాయక్‌ తదితరులు

ఈనాడు, మహబూబాబాద్‌: ‘‘లెక్కలు తేల్చుకుందాం.. అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. సవాల్‌ను స్వీకరించాల్సిన పెద్ద మనిషిని శాసనసభకు రాకుండా చేస్తూ వేరొకరు ప్రెస్‌క్లబ్‌కు వెళ్లి అవాకులు, చవాకులు పేలుతున్నారు’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరోక్షంగా కేటీఆర్‌పై మండిపడ్డారు. ‘‘ప్రజల కోసం ఏం చేశామనే విషయాలపై శాసనసభకు రండి చర్చిద్దామని సీఎం అంటే.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడినందుకే లోక్‌సభ ఎన్నికల్లో సున్నా వచ్చింది.. తీరు మారకుంటే మళ్లీ ప్రజలు సున్నానే ఇస్తారు’’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో రూ.294.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రెండుచోట్ల జరిగిన బహిరంగ సభల్లో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు మురళినాయక్, కోరం కనకయ్య, నాగరాజు, గిడ్డంగులశాఖ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ట్రైకార్‌ ఛైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ పాల్గొన్నారు.

సభల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రసంగిస్తూ... రైతులకు అన్యాయం చేశామంటూ కొందరు విమర్శిస్తున్నారని... తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం అన్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే రూ.21 వేల కోట్లు రుణ మాఫీ చేయటం అన్యాయం చేసినట్లా? సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వటం తప్పవుతుందా? అలాగే కరెంటు సమస్యలంటూ మాట్లాడుతున్నారు... గత ప్రభుత్వం కంటే 2 వేల మెగావాట్లు అదనంగా విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడినా, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తూ కూడా ఇబ్బందులు లేకుండా చేశాం. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ వాటా విషయంలో ముఖ్యమంత్రి ఇటీవలే అఖిలపక్షం ముందు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని, నీళ్ల విషయంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా మా ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మాత్రం అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాల్ని విస్మరించి మాట్లాడారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి పట్టుమని పది వేల ఎకరాలకు నీళ్లివ్వని వారు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు. రైతులకు సంబంధించిన పథకాలకు ఏడాదిన్నరలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేశాం. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు’’ అని భట్టి ధ్వజమెత్తారు.

కేసముద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెక్కు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చిత్రంలో

బలరాంనాయక్, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు 


అధికారమే పరమావధిగా మాట్లాడుతున్నారు

-పొంగులేటి 

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఈరోజు ఒకరు ఏదేదో పేలుతున్నారంటూ.. పరోక్షంగా కేటీఆర్‌పై స్పందించారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేక అధికారమే పరమావధిగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఉచిత బస్సు, రూ.500 బోనస్, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, రూ.500కు గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని, వసతి గృహాల విద్యార్థులకు మెస్, కాస్మెటిక్‌ ఛార్జీలు పెంచుతామని అంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము ప్రజలకు చెప్పినవే కాకుండా.. అదనంగా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. 

కేసముద్రం బహిరంగ సభకు హాజరైన ప్రజలు 


టింగ్‌ టింగ్‌ టింగ్‌ 

పొంగులేటి రెండు సభల్లో తన ప్రసంగంలో రైతు భరోసా పథకం గురించి ప్రస్తావించారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు.. రైతుల ఖాతాల్లో టింగ్‌..టింగ్‌..టింగ్‌మంటూ పడ్డాయంటూ సభికులను ఆకట్టుకునేలా చెప్పటం ప్రత్యేకంగా నిలిచింది. 


స్థానిక ఎన్నికల్లో గెలిపించాలి..

భలకు తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి వక్తలు చేసిన ప్రసంగాలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పనులను మంత్రులంతా వివరిస్తూ.. ఇందిరమ్మ పాలన.. ప్రజాపాలనకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యక్తులను నిలబెడతామని.. మీరంతా ఒక్క తాటిపైకి వచ్చి భారీ మెజారిటీలతో గెలిపించాలన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవటానికే పేదల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని అన్నారు. అన్నివర్గాల సంక్షేమం..పేదల అభ్యున్నతి పట్ల అంకితభావంతో కాంగ్రెస్‌ పనిచేస్తోందని, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. 


వేం నరేందర్‌రెడ్డి చొరవతోనే నిధులు.. 

వేం నరేందర్‌రెడ్డి స్వగ్రామం ఇక్కడే ఉండటం.. ప్రస్తుతం ఆయన కీలక పదవిలో ఉండటంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రులు చెప్పారు. రూ.400 కోట్ల వరకు నిధులు కేటాయింపు జరిగేలా ఆయన ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. 


సీఎం సలహాదారు వాహనం నుంచి పొగలు

హబూబాబాద్‌ రూరల్, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల జిల్లా పర్యటనలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. మహబూబాబాద్‌లో హెలిప్యాడ్‌ సమీపాన నేతల వాహనాల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. అందులో ముఖ్యమంత్రి  సలహాదారు వేం నరేందర్‌రెడ్డి వాహనం కూడా ఉంది. ఆయన్ను తీసుకురావడానికి దాన్ని స్టార్ట్‌ చేయగానే ఏసీ షార్ట్‌సర్క్యూట్‌ అయి పొగలు వచ్చాయి. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు.

Tags :
Published : 09 Jul 2025 03:22 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని