EV Charging stations: రాష్ట్రం నలువైపులా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు!

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Nov 2025 05:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కొత్తవి ఏర్పాటుకు 3,752 స్థలాల గుర్తింపు
ఛార్జింగ్‌ స్టేషన్‌కు రూ.24 లక్షల వరకూ రాయితీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు ఛార్జింగ్‌ స్టేషన్ల(సీఎస్‌) కొరత తీర్చేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం సీఎస్‌లు లేక ఈవీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య తీర్చడానికి కొత్తగా ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా 3,752 స్థలాలను విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు గుర్తించాయి. వీటి ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే దానికి అవసరమైన విద్యుత్‌ సరఫరా లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు వంటి పనులకయ్యే వ్యయంలో 80 శాతం చొప్పున గరిష్ఠంగా ఒక్కో ఛార్జింగ్‌ స్టేషన్‌కు రూ.24 లక్షల వరకూ రాయితీని ఇవ్వనున్నారు. విద్యుత్‌ సరఫరాకయ్యే ఖర్చులను స్టేషన్‌ ఏర్పాటుదారుల తరఫున డిస్కంలు భరిస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో స్థలం ఉండి ఏర్పాటుచేస్తే సదుపాయాల వ్యయంలో 100 శాతం సొమ్మును కేంద్రం ఇస్తుంది.


ఉన్నవి చాలా తక్కువ...

ప్రస్తుతం రాష్ట్రంలో లోటెన్షన్‌(ఎల్‌టీ) ఈవీ సీఎస్‌లు 586, హైటెన్షన్‌(హెచ్‌టీ) సామర్థ్యం గలవి 48 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నందున కనీసం 5 వేల ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమని అంచనా. ప్రధానంగా నగరం దాటితే ప్రధాన, జాతీయ రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. వీటి ఏర్పాటుకు, నిర్వహణకు కీలకమైన విద్యుత్‌ సరఫరా పనులన్నీ డిస్కంలు మొదటి ప్రాధాన్యంగా గుర్తించి వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది.


ఛార్జింగ్‌ స్టేషన్‌తో స్థిర ఆదాయం

50 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసే సీఎస్‌కు రూ.6.04 లక్షలు, 100లోపు అయితే రూ.14.80 లక్షలు, 150 కిలోవాట్లలోపయితే రూ.19 లక్షలు, అంతకుమించితే గరిష్ఠంగా రూ.24 లక్షల రాయితీని పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద ఇస్తామని కేంద్రం తెలిపిందని దక్షిణ తెలంగాణ డిస్కం సీఎండీ ముషారఫ్‌ ‘ఈనాడు’కు చెప్పారు. ఎవరైనా సరే ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకుంటే యూనిట్‌ కరెంటును రూ.7కే సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈవీలకు సీఎస్‌ల ఏర్పాటు బాధ్యతలను తాజాగా రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(రెడ్కో)కు అప్పగిస్తూ.. నోడల్‌ ఏజెన్సీగా నియమించారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా తమకు స్థలం ఉన్నా లేదా ఇతరుల స్థలాన్ని లీజుకు తీసుకున్నా.. సీఎస్‌ ఏర్పాటుకు రెడ్కో నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :
Published : 03 Nov 2025 04:59 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు