ఉలవల సాగుకు ఊతం

Eenadu icon
By Telangana News Desk Updated : 28 Oct 2025 05:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

క్రాప్‌ ట్రస్టు నిర్ణయం
సాగు వృద్ధికి అవకాశం
కేంద్ర ప్రభుత్వానికి లేఖ 

ఈనాడు, హైదరాబాద్‌: ఉలవలు... ఉలవచారు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి పరిచయమే. పోషక విలువలు అధికంగా ఉండి.. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంతో తక్కువగా సాగవుతున్న దేశీయ పంటగా... రాబోయే సంవత్సరాలలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్న పంటగా జర్మనీకి చెందిన అంతర్జాతీయ పంటల వైవిధ్య పరిరక్షణ సంస్థ క్రాప్‌ ట్రస్ట్‌ గుర్తించింది. దాని జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు, భవిష్యత్‌ ఆహారభద్రత, విత్తనోత్పత్తికి ఊతమిచ్చేందుకు ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రపంచ వ్యాప్తంగా పంటల వైవిధ్య పరిరక్షణకు క్రాప్‌ ట్రస్టు కృషి చేస్తోంది. అరుదైన లక్షణాలుండి ఎక్కువగా సాగు కాని పంటలను గుర్తించి, వాటి సంరక్షణ, ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దాతల సాయంతో ఒక ప్రాజెక్టును నిర్వహిస్తోంది. భారత్‌లోని ఎం.ఎస్‌. స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి ఉలవలను సిపార్సు చేయగా క్రాప్‌ ట్రస్టు దానిని తమ ప్రాజెక్టులో చేర్చింది.

ఏం చేస్తుందంటే...

ఉలవ పంట వైవిధ్యాన్ని జీన్‌ బ్యాంక్‌లలో క్రాప్‌ ట్రస్టు భద్రపరుస్తుంది. ఈ సంస్థ అందించే దాదాపు రూ.100 కోట్ల సాయంతో కేంద్ర ప్రభుత్వం సాగు విస్తరణకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. జాతీయ పప్పుదినుసుల పరిశోధన సంస్థ ద్వారా కొత్త వంగడాల వృద్ధిని చేపడుతుంది. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా విత్తనోత్పత్తి చేయిస్తుంది. సబ్సిడీపై రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తుంది. విత్తనోత్పత్తిలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తుంది. అవి రూపొందించిన విత్తనాలను విక్రయాలకు అనుమతిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో పంటలకు మంచిరోజులు..

క్రాప్‌ ట్రస్టు ప్రాజెక్టు ప్రారంభిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉలవల సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. భారత పప్పు దినుసుల పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలో ఉలవ పంట 5,07,000 హెక్టార్లలో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.  ఏపీలో 1.25 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 8,200 ఎకరాల్లో సాగవుతోంది. మద్దతు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు ఈ పంటను విస్తృతంగా వేయడానికి వెనుకాడుతున్నారు. ఒకేరకం విత్తనాలు ఉండగా..  అవీ ప్రభుత్వపరంగా లభించడంలేదు. క్రాప్‌ ట్రస్టు ప్రాజెక్టు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ సాగును పెంచేందుకు ముందుకొస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి 

ప్రస్తుతం 3ఎకరాలు సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.4 వేలు ఖర్చవుతోంది. ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మార్కెట్లు అందుబాటులో లేక వ్యాపారులకు విక్రయిస్తున్నా. విత్తనాలకు రాయితీలు, పంటకు మద్దతు ధరను ప్రకటించి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 

రైతు బోయిని బసప్ప, మంతట్టి గ్రామం, వికారాబాద్‌ జిల్లా

Tags :
Published : 28 Oct 2025 04:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని