భాషకు డిజి శ్వాస.. ప్రత్యేక పోర్టల్‌లు, యాప్‌లు

Eenadu icon
By Telangana News Desk Updated : 29 Oct 2025 19:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పలు గిరిజన, ప్రాంతీయ మాండలికాలు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నాయి..! దేశ సంస్కృతికి వెన్నెముకగా ఉండే ఈ భాషలను డిజిటలైజేషన్‌ చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ నడుం బిగించింది. దీనికోసం ప్రత్యేక పోర్టల్‌లు, యాప్‌లను రూపొందించింది.

దేశ సంస్కృతిలో అనేక భాషలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 22 షెడ్యూల్డ్‌ భాషలతో పాటు వందల సంఖ్యలో గిరిజన, ప్రాంతీయ మాండలికాలున్నాయి. కాలక్రమంలో కనుమరుగవుతోన్న వీటి పరిరక్షణకు కేంద్ర సాంస్కృతిక శాఖ నడుం బిగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సహకారంతో భాషల సంరక్షణపై దృష్టి పెట్టింది. ఈ భాషలను డిజిటలైజేషన్‌ చేసే దిశగా అడుగులేస్తుంది. ప్రత్యేకంగా పోర్టల్‌లు, యాప్‌లను తయారుచేసింది. భాషా ప్రియులే కాదు.. వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఇవీ ఎంతో ఉపయోగపడనున్నాయి. భాష, సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారు, వీటిపై పరిశోధన చేసే వారికి ఇవి ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. విద్యార్థులు, వివిధ సంస్కృతుల గురించి అధ్యయనం చేసే వారు వీటి ద్వారా సమగ్ర వివరాలను సేకరించుకోవచ్చు. ఒకవైపు భాష సంరక్షణ, మరోవైపు అరచేతిలో వివిధ భాషలు, మాండలికాల సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి.


సంచిక

పోర్టల్‌ను సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్‌ భాషలతో పాటు మాండలికాలకు సంబంధించిన నిఘంటువులు ఉంటాయి. కథల సంచికలు, వివిధ రంగుల చిత్రాలతో కూడిన వర్ణనలు ఉంటాయి. విద్యా పరిశోధన, భాషా విద్య, సాంస్కృతిక డాక్యుమెంటేషన్‌కు ఉపయోగపడే ఆడియో, వీడియోలు ఇందులో ఉంటాయి. ఏఐ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఈ సంచిక పోర్టల్‌ భాషా ప్రియులకు మరింత దోహదపడుతుంది.


ఆది-వాణి

గిరిజన భాషల కోసం ఏఐ సాంకేతికతతో ఆది-వాణి యాప్‌ను 2024లో రూపొందించారు. గిరిజన భాషల అనువాదం, పరిరక్షణ కోసం ఏఐ వేదికలో వచ్చిన మొదటి యాప్‌ ఇది. దేశంలో ప్రధాన గిరిజన భాషలు ఇందులో అందుబాటులో ఉంటాయి. గిరిజనులకు సంబంధించిన భాషలను ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేసుకోవచ్చు. భాషను సంరక్షించడమే కాకుండా విద్య, పాలన, సాంస్కృతిక డాక్యుమెంటేషన్‌ వంటి వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.


భాషిణి

హుభాషా అనువాదంలో ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడనుంది. ఏఐ టెక్నాలజీతో ఈ అనువాదాన్ని రూపొందించారు. భారతీయ భాషలతో పాటు గిరిజన భాషలను ఇది అనువాదం చేస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌ను 10లక్షల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 295 మిలియన్‌ అనువాదాలు ఈ యాప్‌ ద్వారా జరిగాయి. కేంద్ర గిరిజన పరిశోధన, సమాచారం, విద్య, సమాచార పథకంలో భాగంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంగ్లిషు, హిందీతో పాటు ఇతర భాషల ప్రసంగాలను సైతం గిరిజన భాషలోకి అనువాదం చేస్తాయి. 


ఈ-కుంభ్‌

ఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సొంతంగా ఈ-కుంభ్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో భారతీయ భాషల్లో సాంకేతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌ ఉంటాయి. దీనితోపాటు అనువాదిని అనే టూల్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంజినీరింగ్, వైద్యం, చట్టం, అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు మెటీరియల్‌ను ఒక భాషలో నుంచి మరొక భాషలకు అనువాదం చేస్తుంది. ఏఐ టెక్నాలజీతో ఏఐసీటీఈ వీటిని అభివృద్ధి చేసింది. ఇందులో 16,610 కోర్సులు ఉన్నాయి. సుమారు 5.6కోట్ల మంది ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :
Published : 29 Oct 2025 19:23 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు