సంక్షిప్త వార్తలు(5)

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

తెలంగాణ ఇంటర్‌ బోర్డు నమూనా అనుసరించదగింది 
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌పై పలు దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించి వివిధ బోర్డుల ప్రతినిధులకు వివరిస్తున్న వసుంధర

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ వార్షిక, ప్రయోగ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంపునకు, కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఇతర అంశాలను ఇంటర్‌ బోర్డు నుంచే పర్యవేక్షించేందుకు నెలకొల్పిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నేపాల్, భూటాన్‌ దేశాలు, కర్ణాటక, కశ్మీర్, ఏపీ తదితర రాష్ట్రాల బోర్డుల ఉన్నతాధికారులు, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘‘తెలంగాణ బోర్డు నమూనా దేశంలోని రాష్ట్రాలు, పొరుగు దేశాలు కూడా అనుసరించదగింది. మా దేశాలు, రాష్ట్రాల బోర్డుల్లో ఇలాంటి సాంకేతిక వ్యవస్థలను అమలు చేస్తే బాగుంటుంది. మావద్ద ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటే తెలంగాణ ఇంటర్‌ బోర్డు సహకారం తీసుకుంటాం’’ అని అన్నారు. కార్యక్రమంలో బోర్డు సంయుక్త కార్యదర్శులు వసుంధర, భీమ్‌సింగ్, సిలబస్‌ నిపుణుడు రమణారావు, అకడమిక్‌ గైడెన్స్‌ అధికారి జయమణి తదితరులు పాల్గొన్నారు. 


‘న్యాయవాదుల సంక్షేమ నిధి’లో.. 35-65 ఏళ్ల వారికి ఒక్క అవకాశం 
బార్‌ కౌన్సిల్‌ నిర్ణయం 

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయవాదుల సంక్షేమ నిధి (అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌)లో చేరడానికి 35 నుంచి 65 ఏళ్లవారికి ఒక్క అవకాశం కల్పించాలని బార్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యే సమయంలో రూ.3,500 వసూలుచేసి ఈ నిధిలో సభ్యత్వం కల్పిస్తారు. అయితే న్యాయవాద వృత్తిలో ఉంటూ ఇంతవరకు సభ్యత్వం లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నిధిలో చేరినవారికి రూ.10 లక్షల బీమా, వైద్య సౌకర్యాలు వంటి ప్రయోజనాలుంటాయి. అయితే చాలామంది వీటిని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 35-65 ఏళ్లవారికి ఒక్క అవకాశం కల్పించాలని బార్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఈ మేరకు నవంబరు 1 నుంచి డిసెంబరు 31లోగా ఫీజు చెల్లించాలని బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 


లింగంపల్లిలో మరో 5 రైళ్లకు హాల్టింగ్‌

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో.. ఈ నెల 1(శనివారం) నుంచి మరో ఐదు రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు. వాటిలో రాజ్‌కోట్, పోర్‌బందర్, పద్మావతి, హుస్సేన్‌ సాగర్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 


ఎక్సైజ్‌శాఖ నూతన బ్యాచ్‌కు 3 నుంచి శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆబ్కారీశాఖకు కొత్తగా ఎంపికైన అధికారులకు ఈనెల 3 నుంచి శిక్షణ ఇచ్చేందుకు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవలే టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికైన అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు,  ఎస్సైలు శనివారం అకాడమీలో రిపోర్ట్‌ చేయనున్నారు.


‘ఇగ్నో’ ప్రాంతీయ కేంద్రం నూతన ఆర్డీగా రాజు 

ఈనాడు, హైదరాబాద్‌: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం నూతన రీజనల్‌ డైరెక్టర్‌(ఆర్డీ)గా బొల్లా రాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రంలో సుదీర్ఘకాలంపాటు సేవలందించిన సీనియర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కందుకూరి రమేశ్‌ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు ఆయనను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని