వసూలు చేసిన రూ.6.81 కోట్లను వడ్డీతో చెల్లించాలి

Eenadu icon
By Telangana News Desk Updated : 01 Nov 2025 04:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గోల్డ్‌ఫిష్‌ అడోబ్‌ సంస్థకు రెరా ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: కార్పస్‌ఫండ్‌తోపాటు భవిష్యత్తు నిర్వహణ రుసుం పేరుతో వసూలు చేసిన రూ.6,81,78,726 మొత్తాన్ని వడ్డీతో కలిపి విల్లాల కొనుగోలుదారులకు వెనక్కు ఇచ్చేయాలని గోల్డ్‌ఫిష్‌ అడోబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఆదేశిస్తూ తెలంగాణ రెరా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందంలో పేర్కొన్న అన్ని వసతులు కల్పించాలనీ స్పష్టంచేసింది. కోకాపేటలో ఆ సంస్థ ‘గోల్డ్‌ఫిష్‌ జ్రెస్టా’ పేరుతో 42 విల్లాల నిర్మాణం చేపట్టింది. జిమ్, ఈతకొలను, క్లబ్‌హౌస్, క్రీడాస్థలం, పెంపుడు జంతువుల పార్కు వంటి వసతులు కల్పిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేయడంతో పలువురు ఆసక్తి చూపారు. దాంతో మొత్తం విల్లాలు అమ్ముడు పోయాయి. అయితే ఒప్పందంలో పేర్కొన్న వసతులు కల్పించకపోగా అసంపూర్తి విల్లాలనే తమకు అంటగట్టారని, అనేక నిబంధనలు ఉల్లంఘించారని.. కొనుగోలుదారులంతా ‘జెస్ట్రా విల్లా ఓనర్స్‌ మెయింటెనెన్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌’ పేరుతో ఒక సొసైటీగా ఏర్పడి రెరాకు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2018 నాటికే పూర్తికావాలని, చాలామేర అసంపూర్తిగా ఉన్న విల్లాలనే అంటగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొనుగోలుదారులకు తెలియకుండానే గోల్డ్‌ఫిష్‌ సంస్థ యాజమాన్యం ప్రాజెక్టు నిర్మాణ సమయాన్ని 2025 మార్చి 31 వరకు పొడిగించేలా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తెచ్చుకుందని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇలా అనుమతి తెచ్చుకున్నందువల్ల ప్రాజెక్టును రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన రెరా.. వసూలుచేసిన కార్పస్‌ఫండ్, భవిష్యత్తు రుసుమును వడ్డీతో చెల్లించాలని, వెంటనే ప్రాజెక్టును రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. అలాగే తమ ఆదేశాల అమలులో విఫలమైతే గోల్డ్‌ఫిష్‌ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించింది.

Tags :
Published : 01 Nov 2025 03:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు