‘తుమ్మిడిహెట్టి - సుందిళ్ల’ పనులపై మరో అడుగు

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

డీపీఆర్‌ తయారీకి రూ.11.88 కోట్లు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటిని మళ్లించే పనులకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.11.88 కోట్లు మంజూరు చేస్తూ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం ఆదేశాలు జారీ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ, 71.5 కి.మీ. నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని మళ్లించేలా పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2008 నుంచి జరిగింది ఇదీ...

  • ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా 2008లో 28 ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 2014 వరకు పాక్షికంగా కొన్ని పనులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక నాటి ప్రభుత్వం ఆ ప్రణాళికను మార్చింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత నది నీటిని ఎల్లంపల్లికి, అక్కడి నుంచి దిగువకు కాకుండా... గోదావరి, ప్రాణహిత సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి.. నది ద్వారానే ఎల్లంపల్లికి ఎత్తిపోయడం, తర్వాత ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటిని మళ్లించేలా మార్పు చేసింది. 
  • గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, దీనిపై విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ, జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణలు జరగడం, బ్యారేజీ భవిష్యత్తు ఏంటన్నది ఇంకా తేలకపోవడంతో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా తుమ్మిడిహెట్టి నుంచే నీటిని మళ్లించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. 
  • 2008లో టెండర్లు ఖరారు చేసినప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నాలుగు ప్యాకేజీల్లో పనులు అప్పగించింది. నాలుగో ప్యాకేజీలో 71.5 కి.మీ. నుంచి 116 కి.మీ. వరకు (ఎల్లంపల్లికి) నీటిని తరలించాలి. ఈ పనిలో లిప్టు కూడా ఉంది. గత ప్రభుత్వం ఎల్లంపల్లికి మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా పనులు చేసినందున 71.5 కి.మీ. నుంచి పనులను అప్పట్లో రద్దు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఉపయోగపడేలా మాత్రమే నిర్మించాలని తలపెట్టారు. అయితే పనులు పూర్తి కాలేదు. 
  • ప్రస్తుత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ పూర్తిచేసి 71.5 కి.మీ. వరకు నీటిని తెచ్చి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి కాకుండా కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్లకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ పనికి లిప్టు అవసరం లేదు. 71.5 కి.మీ. నుంచి సుందిళ్ల వరకు కాలువ, సొరంగం తదితర పనులకు సంబంధించిన డీపీఆర్‌ తయారీ బాధ్యతలు కన్సల్టెన్సీకి అప్పగించడానికి ప్రస్తుతం నిధులు కేటాయించింది. సుందిళ్ల నుంచి మళ్లీ ఎల్లంపల్లికి ఎత్తిపోయడం కాకుండా నేరుగా దిగువన కలపడానికి కూడా అవకాశం ఉందేమో పరిశీలించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని