సంక్షిప్త వార్తలు (5)

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముఖ్యమంత్రిని కలసిన సుదర్శన్‌రెడ్డి 

సీఎం రేవంత్‌రెడ్డి దంపతులకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సుదర్శన్‌రెడ్డి దంపతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్‌రెడ్డి సతీసమేతంగా శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


క్రీడల కోటాలో 172 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో క్రీడల కోటాలో 172 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను పంచాయతీరాజ్‌ శాఖ సంచాలకురాలు సృజన శనివారం విడుదల చేశారు. గత అయిదేళ్లుగా ఈ నియామకాలు పెండింగులో ఉన్నాయి. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జేపీఎస్‌ల నియామకంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


సీఎంపై సీఈవోకు భాజపా ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో భాజపా నేతల బృందం శనివారం హైదరాబాద్‌లో చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈవో) సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో పాటు పాకిస్థాన్‌పై బాంబులు వేయకుండా భాజపా వాళ్లు జూబ్లీహిల్స్‌కు వచ్చి కార్పెట్‌ బాంబింగ్‌ చేస్తారని సీఎం అన్న వ్యాఖ్యలు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఓటర్లను బ్లాక్‌మెయిల్‌ చేసే విధంగా మాట్లాడిన తీరు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. 


భక్తుల భద్రత కీలకం: మంత్రి సురేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ దేవాదాయశాఖ అప్రమత్తమైంది. ఏకాదశి, కార్తీక దీపోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో క్యూలైన్ల ఏర్పాట్లు, కనీస వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం కమిషనర్‌ను ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


ఏడీఎంఈ పదోన్నతులకు 48 మందితో డీపీసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 16 అదనపు డీఎంఈ స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. 48 మంది అర్హులతో డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) సీనియారిటీ జాబితాను శనివారం డీఎంఈ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు