జాతీయ రహదారిపై లోతట్టు ప్రాంతం!

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 04:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ హైవేపై చిట్యాల వద్ద 4 కి.మీ. మేర ట్రాఫిక్‌ కష్టాలు

చిట్యాల రైలు వంతెన కింద ఇదీ పరిస్థితి

చిట్యాల, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల వద్ద శుక్రవారం ఉదయం నుంచి శనివారం రాత్రి వరకు వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టణ సమీపంలో హైవేపై ఉన్న రైలు వంతెన కిందిభాగం లోతట్టుగా ఉంటుంది. రోడ్డు నిర్మించిన రెండేళ్ల తర్వాత కురిసిన వర్షానికి ఇక్కడ భారీగా నిలిచి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ స్పందించి... నీటిని సమీపంలోని పోతురాజు కుంటలోకి మళ్లించడానికి కాలువ తవ్వించారు. వర్షాకాలంలో అప్పుడప్పుడు నీరు నిలుస్తున్నా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగలేదు. అయితే... పురపాలికలో సేకరించిన చెత్తను డైవర్షన్‌ కాలువ సమీపంలో పడేయడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కొన్ని నిర్మాణాలు జరగడంతో కాలువంతా మట్టితో నిండిపోయింది. దాంతో ఇటీవలి వర్షాలతో సమస్య పునరావృతమైంది. రోడ్డుపై గుంతలూ పడ్డాయి. ఎగువ నుంచి జాలు నీరు సైతం నిరంతరం వస్తుండటంతో... గురువారం రాత్రి బైక్‌లు సగం వరకు మునిగే స్థాయికి వరద చేరింది. వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచే వాహనాల రాక పెరిగాయి. వంతెన కింద వేగం గణనీయంగా తగ్గడంతో హైదరాబాద్‌ వైపు నుంచి 4 కి.మీ. వరకు ట్రాఫిక్‌ ఆగిపోయింది. శనివారం ఉదయం తేరుకున్న అధికారులు... నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. చిట్యాల నుంచి సెప్టిక్‌ ట్యాంకర్లను, నల్గొండ, రామన్నపేటల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి... నీటిని తోడగా... సాయంత్రానికి సమస్య కొంతమేరకు తగ్గింది. వంతెన కిందికి చేరుతున్న నీరు ఎప్పటికప్పుడు పోతురాజుకుంటలోకి వెళ్లేలా శాశ్వత పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని