ఇక ఊరూరా బ్యాంకింగ్‌ సేవలు

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Nov 2025 07:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రతి పల్లెకు 5 కి.మీ.  పరిధిలో అందుబాటులోకి..
ఎస్‌ఎల్‌బీసీలకు కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి పల్లెకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్రం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితు(ఎస్‌ఎల్‌బీసీ)లకు ఆదేశాలు జారీచేసింది. ఇంతవరకు ఈ సేవలు అందుబాటులోలేని గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు వాటిని విస్తరించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రతి పల్లెకు 5 కి.మీ. పరిధిలోనే ఒక బ్యాంకు లేదా బ్యాంకు సేవాకేంద్రం (బ్యాంకింగ్‌ టచ్‌ పాయింట్‌), ఏటీఎం అయినా తప్పనిసరిగా ఉండాలి. కొండ ప్రాంతాల్లోని  ప్రతి 500 కుటుంబాలకు ఈ సేవలు అందుబాటులోకి తేవాలి. వీటిని ఏర్పాటుచేసే బాధ్యతలను రాష్ట్రాల బ్యాంకర్ల సమితులు చేపట్టాలి. బ్యాంకింగ్‌ సేవల విస్తరణపై కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి వంటి జిల్లాల్లోని మారుమూల అటవీ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చే అంశంపై ఎస్‌ఎల్‌బీసీ దృష్టి సారించాలి.

  • రాష్ట్రంలోని ప్రతి పల్లెకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. అవసరమైన ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించి ప్రజల వద్దకెళ్లి బ్యాంకింగ్‌ సేవలందేలా చూడాలి.
  • తెలంగాణలో 221 పల్లెలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేవని గతంలో గుర్తించారు. అయితే వాటన్నింటికీ అందుబాటులోకి తెచ్చే పనులు పూర్తయినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి వర్గాలు చెబుతున్నాయి.
  • రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవాలంటే 4జీ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ బాగుండాలి. కుమురంభీం జిల్లాలోని మేతిందని గ్రామానికి ఈ సిగ్నల్స్‌ సరిగా అందడం లేదని బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి తెలిపింది. భూమి కేటాయిస్తే ‘4జీ’ టవర్‌ను ఏర్పాటుచేసే వీలుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేకంగా కరస్పాండెంట్‌ను నియమించారు. 
  • రాష్ట్రంలో మొత్తం 6,644 బ్యాంకు శాఖలుండగా వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,900 మాత్రమే పనిచేస్తున్నాయి. 

రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవలు ఇలా.. 

బ్యాంకుశాఖలు : 6,644, 
ఏటీఎంలు       : 8,869
సూక్ష్మ ఏటీఎంలు: 18,202
వ్యాపారుల వద్ద పీవోఎస్‌ యంత్రాలు: 3,51,822
పీఎం జన్‌ధన్‌ యోజన ఖాతాలు: 1,28,07,355
జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు: రూ.5,629 కోట్లు

Tags :
Published : 03 Nov 2025 07:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని