ప్రిన్సిపల్‌ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విద్యార్థినిపై చేయిచేసుకున్నారని.. మహిళా కానిస్టేబుల్‌పై దాడి

షాద్‌నగర్‌ పట్టణ కూడలిలో ఆందోళన చేస్తున్న విద్యార్థినులు

షాద్‌నగర్‌ న్యూటౌన్, న్యూస్‌టుడే: ప్రిన్సిపల్‌ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను విధుల నుంచి తొలగించాలంటూ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలీపూర్‌ శివారులోని నూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల భవనంలో నాగర్‌కర్నూల్‌ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ప్రిన్సిపల్‌ శైలజలతోపాటు కొందరు అధ్యాపకులు తమను వేధిస్తున్నారని విద్యార్థినులు కళాశాల నుంచి ర్యాలీగా వచ్చి జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డుపై ధర్నా చేశారు. తర్వాత షాద్‌నగర్‌ పట్టణ కూడలికి చేరుకుని దాదాపు 450 మంది బైఠాయించారు. 3 గంటలపాటు అలాగే ఉండటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సివిల్‌ డ్రెస్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ జ్యోత్స్న విద్యార్థినిపై చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ.. ఆమెను ఇతర విద్యార్థినులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దాడి చేశారు. స్థానికులు, పోలీసులు వారిని అడ్డుకున్నారు. షాద్‌నగర్‌ పట్టణ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ ఠాణాలో మాట్లాడుదామని నచ్చజెప్పడంతో విద్యార్థినులు అక్కడికి వెళ్లారు. సాంఘిక సంక్షేమశాఖ మల్టీ జోనల్‌ అధికారిణి నిర్మల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ పాటించడం లేదనీ, హాజరు తక్కువగా ఉందని డబ్బులు తీసుకుంటున్నారనీ, ప్రశ్నిస్తే  ప్రిన్సిపల్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వారిని సస్పెండ్‌ చేస్తామని హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. మరోసారి కూడలిలో ధర్నాకు దిగగా.. పోలీసులు వారిని బస్సుల్లో కళాశాలకు తరలించారు. షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ, నిర్మల అక్కడకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు