సైబర్‌ నేరాల నియంత్రణకు కవచం

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డిజిటల్‌ చెల్లింపులపై నిఘా కేంద్రంగా ‘ఐడీపీఐసీ’
ఏఐ, ఎంఎల్‌ పరిజ్ఞానంతో మ్యూల్‌ ఖాతాల లావాదేవీల పరిశీలన

రోజురోజుకీ తీవ్రమవుతున్న సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు సరికొత్త కవచం అందుబాటులోకి రాబోతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతిచ్చిన నేపథ్యంలో ‘ఇండియన్‌ డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌(ఐడీపీఐసీ)’ అనే వ్యవస్థను స్థాపించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)ల నేతృత్వంలో రూపొందుతోన్న ఈ ప్లాట్‌ఫాం డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలకు నిఘా కేంద్రంగా పనిచేయనుంది.

రూ.500 కోట్ల మూలధనంతో ఏర్పాటుకు కసరత్తు

కమీషన్‌కు ఆశ పడి తమ బ్యాంకు ఖాతా వినియోగాన్ని సైబర్‌ నేరస్థులకు అప్పగించే వారిని ‘మ్యూల్‌’ ఖాతాదారులుగా వ్యవహరిస్తుంటారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ మోసాలు రూ.36,014కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది జరిగిన మోసాలు రూ.12,230 కోట్లతో పోల్చితే దాదాపు మూడు రెట్లు పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ మ్యూల్‌ ఖాతాల లావాదేవీలను రియల్‌టైంలో గుర్తించి అడ్డుకునేందుకే ఐడీపీఐసీ ఏర్పాటుకు అనుమతించింది. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో వెంటవెంటనే జరిగే మ్యూల్‌ ఖాతాల లావాదేవీలను గుర్తించి తక్షణం ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఐడీపీఐసీ పనిచేయనుంది. రూ.500కోట్ల అధీకృత మూలధనం, రూ.200కోట్ల చెల్లింపు మూలధనంతో ఐడీపీఐసీని లాభాపేక్ష లేని సంస్థగా, సెక్షన్‌ 8 కంపెనీగా స్థాపించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఎస్‌బీఐ, బీవోబీలు రూ.10కోట్ల చొప్పున ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. ఆయా బ్యాంకుల నుంచి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఐడీపీఐసీ బోర్డు డైరెక్టర్లుగా పనిచేయనున్నారు. అలాగే దేశంలోని మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందులో భాగస్వామ్యం కానుండటం విశేషం.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు