HYDRAA: ఐదంతస్తుల అక్రమం.. సగం నేలమట్టం

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 04:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మియాపూర్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన మేర హైడ్రా కూల్చివేతలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన మేర శనివారం హైడ్రా కూల్చి వేసింది. అమీన్‌పూర్‌లోని 337, 338 సర్వే నంబర్లలో హుడా అనుమతి పొందిన లేఅవుట్‌ ఉంది. అందులో 400 గజాల 126వ నంబరు ప్లాటును భాను కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలు చేసింది. దాని వెనుక మియాపూర్‌ పరిధి సర్వే నంబరు 101లో ప్రభుత్వ భూములు ఉంటాయి. భాను కన్‌స్ట్రక్షన్‌ యజమానులు.. హుడా లేఅవుట్‌లోని ప్లాటును, మియాపూర్‌ సర్వే నం.101లోని 473 గజాల భూమిని కలిపి ప్రహరీ నిర్మించారు. 2014లోనే ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ డీడీలు తయారు చేసి అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. అక్రమంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించడంతో స్థానికుల నుంచి మున్సిపాలిటీకి ఫిర్యాదు వెళ్లింది. మున్సిపాలిటీ అధికారులు అనుమతులు రద్దు చేశారు. హెచ్‌ఎండీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. పోలీస్‌ స్టేషన్‌లో కేసు సైతం నమోదైంది. అయినా నిర్మాణ పనులు ఆగలేదు. గృహ ప్రవేశమే తరువాయి అనుకున్న సందర్భంలో.. హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అక్రమ నిర్మాణంపై దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో హైడ్రా, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ అధికారులు సర్వే చేపట్టగా.. సర్కారు భూమిలోకి అపార్ట్‌మెంట్‌ చొచ్చుకొచ్చినట్లు తేలింది. జేసీబీతో కూల్చితే భవన సముదాయమంతా కుప్పకూలుతుందని.. హైడ్రాలిక్‌ కాంక్రీట్‌ క్రషర్‌ పరికరంతో కూడిన భారీ యంత్రం సాయంతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 10 3బీహెచ్‌కే, 5  2బీహెచ్‌కేలను నేలమట్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు