Jubilee hills bypoll: అభివృద్ధికి అవకాశమివ్వండి

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

భారత రాష్ట్ర సమితికి మూడుసార్లు పట్టం కట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను గెలిపించండి
జూబ్లీహిల్స్‌లో సమస్యలకు కేసీఆర్, కేటీఆర్‌లదే బాధ్యత
పోలింగ్‌లోగా కిషన్‌రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెస్తారో చూద్దాం
బోరబండ, ఎర్రగడ్డ ప్రచార సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి 

బోరబండ ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అనిల్‌కుమార్‌ యాదవ్, 
బాబా ఫసియుద్దీన్, అజారుద్దీన్, అభ్యర్థి నవీన్‌కుమార్‌ యాదవ్, మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఈనాడు,హైదరాబాద్, బోరబండ, అమీర్‌పేట, న్యూస్‌టుడే: ‘‘జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గం ఓటర్లుగా మూడుసార్లు భారత రాష్ట్ర సమితికి అవకాశమిచ్చి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. పేదప్రజలకు ఆయన ఎలాంటి సేవలు అందించలేదు. నాకు మంచి స్నేహితుడైనప్పటికీ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలో అడగలేదు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలంటూ ఎప్పుడూ లేఖ కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి. మీరు నవీన్‌ యాదవ్‌కు 30 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయాన్ని అందించండి. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఆయన ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రూ.వందల కోట్ల నిధులు తీసుకొస్తాం. అభివృద్ధి పనులన్నింటినీ నేను దగ్గరుండి చేయిస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఆయన బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నిర్వహించిన కూడలి సమావేశాల్లో ప్రసంగించారు. ‘‘జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంగా మాగంటి సునీతను గెలిపించాలని భారత రాష్ట్ర సమితి నాయకులు సానుభూతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సొంత ఆడబిడ్డను కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెలివేసిన కేటీఆర్, హరీశ్‌రావు మాయమాటలు చెబుతున్నారు. వారి కల్లబొల్లి మాటలకు లొంగకుండా కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపించాలి.  

ఇక్కడి సమస్యలు.. వారి పాపమే

గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి కారును షెడ్డుకు పంపారు. దీంతో సహనం కోల్పోయిన బిల్లా..రంగాలు బెంజ్‌ కార్లు వదిలేసి జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఆటోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇవి కొత్తగా రాలేదు. భారత రాష్ట్ర సమితి నాయకులు అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేశారు. ప్రతి డివిజన్‌లోనూ సమస్యలు పేరుకుపోయాయంటే తండ్రీకుమారులదే బాధ్యత. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్‌కార్డులిచ్చాం. ఓఆర్‌ఆర్‌ , శంషాబాద్‌ విమానాశ్రయం, మెట్రోరైల్‌ మేమే తెచ్చాం. ఇక హైదరాబాద్‌లో గరీబోళ్ల గుండె చప్పుడు పి.జనార్దన్‌రెడ్డి మరణిస్తే ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని నిలబెట్టింది. అప్పుడు సానుభూతి గుర్తుకు రాలేదా? పీజేఆర్‌ చేసిన సేవలకు గుర్తుగా బోరబండ కూడలిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. పీజేఆర్‌లా పేద ప్రజలకు సేవ చేయాలంటే నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలి. 

బోరబండ కాంగ్రెస్‌ ప్రచార సభలో పాల్గొన్న జనం

జూబ్లీహిల్స్‌కు ఎన్ని నిధులిచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలి

కేంద్రమంత్రిగా రెండోసారి పనిచేస్తున్న కిషన్‌రెడ్డి.. ఆయన నియోజకవర్గ పరిధిలోని జూబ్లీహిల్స్‌కు ఎన్ని నిధులిచ్చారో లెక్కచెప్పాలి. పోలింగ్‌లోగా నియోజకవర్గానికి ఎన్ని పైసలు తెస్తారో చూద్దాం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే మీకెందుకు ఇబ్బంది? మైనార్టీల ఓట్లు మీకు రావు. భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయించేందుకే ఇదంతా చేస్తున్నారు. ఉప ఎన్నికలో భాజపా డిపాజిట్‌ కోల్పోవడం ఖాయం. అంతేకాదు.. 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ చెప్పిన ఆ పార్టీకి ఓట్లు వేయకండి. ఈ ఎన్నికల్లో ఒకవైపు మోదీ, కేసీఆర్‌.. మరోవైపు రాహుల్, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అంటూ ఓటర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మంత్రి అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు