Jubilee Hills bypoll: కాంగ్రెస్‌ గెలిస్తే అరాచకాలకు ఊతం

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 03:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రజలకు అండగా నిలిచేది భాజపానే
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

షేక్‌పేటలో భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

అమీర్‌పేట, షేక్‌పేట, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో మజ్లిస్‌ బహిరంగంగా మద్దతిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధిస్తే ఐటీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి సాధించిన కొత్త నగరం కూడా పాతబస్తీలా మారిపోతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో మజ్లిస్‌ అరాచకాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్‌ గెలుపొందినా వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్‌ ఇవ్వబోరని, మజ్లిస్‌ గూటికి చేరి పోటీ చేస్తారని అన్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్‌లలో నిర్వహించిన భాజపా సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు అండగా నిలిచి, సంక్షేమానికి పాటుపడేది భాజపా మాత్రమేనని చెప్పారు. ఎన్నికకు మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉందని.. రాముడికి ఆంజనేయుడిలా పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధిస్తే కార్పొరేటర్‌ స్థానం కూడా ఇక్కడి నుంచి గెలవవచ్చన్నారు. మన ప్రాంతం అభివృద్ధి కావాలి.. ప్రజలకు రక్షణగా నిలవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ను గత భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.  

జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపాలి: సునీల్‌ బన్సల్‌ 

తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గెలిచి చూపించాలని భాజపా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ అన్నారు. ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ భయపడకుండా, ఎక్కడా తగ్గకుండా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు, భాజపా జూబ్లీహిల్స్‌ అభ్యర్థి దీపక్‌రెడ్డి, గౌతమ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఎర్రగడ్డ డివిజన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సునీల్‌ బన్సల్, చిత్రంలో రఘునందన్‌రావు, ఎన్‌.రామచందర్‌రావు, కిషన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, గౌతమ్‌రావు తదితరులు

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కిషన్‌రెడ్డి కాన్వాయ్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌లోని మోతీనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌కు వస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. కేంద్రమంత్రి వస్తున్నా.. పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసుల జాడ లేకపోవడంతో కిషన్‌రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షం వస్తున్నా.. ఆయన స్థానిక చౌరస్తా నుంచి ఫంక్షన్‌హాల్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఇదే సమావేశానికి సునీల్‌బన్సల్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. ముఖ్యనేతలు వస్తున్నా ప్రొటోకాల్‌ పాటించకపోవడమేమిటని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకే: డీకే అరుణ

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకే రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకోవాలని చూస్తున్నారని భాజపా ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు