NEET UG 2025: తొలి వందలో 11 మనకే
నీట్-యూజీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
రాజస్థాన్, మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి రెండు ర్యాంకులు
తెలంగాణ టాపర్‌గా 18వ ర్యాంకర్ కాకర్ల జీవన్‌సాయికుమార్
ఏపీ టాపర్‌గా 19వ ర్యాంకర్ కార్తీక్‌రామ్

దిల్లీ; ఈనాడు, హైదరాబాద్: జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష.. నీట్-యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 20లో ఇద్దరు, టాప్ 100లో 11 మంది (తెలంగాణ 5, ఏపీ 6) ర్యాంకులు సాధించారు. తొలి ర్యాంకును రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్, రెండో ర్యాంకును మధ్యప్రదేశ్ విద్యార్థి ఉత్కర్ష్ అవధియ దక్కించుకున్నారు. కృషాంగ్ జోషి (మహారాష్ట్ర), మృణాల్ కిశోర్ ఝా (దిల్లీ) 3, 4 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. దిల్లీకి చెందిన అవికా అగర్వాల్ 5వ ర్యాంకు సాధించి.. అమ్మాయిల విభాగంలో టాపర్‌గా నిలిచింది. కాకర్ల జీవన్ సాయికుమార్ 18వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్‌గా నిలిచాడు. ఈ విద్యార్థి స్వస్థలం తణుకు కాగా.. హైదరాబాద్‌లో ఇంటర్ చదివి, ఇక్కడే నీట్ రాశాడు. మొత్తం 720 మార్కులకు గానూ 670 (99.99 పర్సంటైల్) సాధించాడు. దీంతో పాటు వందలోపు 37, 46, 48, 95 ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు సాధించారు. ఏపీ నుంచి జాతీయస్థాయిలో 19వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్‌రామ్ కిరీటి.. ఆ రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. దీంతోపాటు 56, 59, 64, 70, 92 ర్యాంకులు ఏపీ విద్యార్థులకు దక్కాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం ఈ ఫలితాలను ప్రకటించింది.
12.36 లక్షల మంది ఉత్తీర్ణత.. అందులో 7.2 లక్షల మంది అమ్మాయిలే
ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్-యూజీ రాయగా, 12.36 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో అమ్మాయిలు 7.2 లక్షల మందికిపైగా ఉండగా, అబ్బాయిల సంఖ్య 5.14 లక్షల మేర ఉంది. తెలంగాణ నుంచి 70,259 మంది మే 4న ఈ పరీక్ష రాయగా.. 41,584 మంది (59.18 శాతం) అర్హత సాధించారు. 2024లో నీట్ పరీక్షకు హాజరైన వారి సంఖ్య 77,848 మంది కాగా 47,356 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హత పొందిన వారి శాతం కాస్త తగ్గడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి 57,934 మంది నీట్- యూజీ పరీక్ష రాయగా.. 36,776 మంది (63.48 శాతం) అర్హత సాధించారు.
తగ్గిన మార్కులు
నీట్-యూజీ పరీక్ష 720 మార్కులకు కాగా.. గతేడాది 17 మంది విద్యార్థులు నూరు శాతం మార్కులు సాధించారు. ఈసారి ఒక్కరు కూడా 720 మార్కులు సాధించలేదు. ఈసారి జనరల్‌లో 141 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. గత సంవత్సరం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో.. ఈసారి అవకతవకలకు చోటు లేకుండా ఉండేందుకు అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులను వచ్చే వారం విడుదల చేస్తామని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ నందకుమార్‌రెడ్డి తెలిపారు.
అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల్లో 529 మంది విదేశీయులు, 405 మంది ప్రవాస భారతీయులు కాగా.. 606 మందికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉంది.
ర్యాంకులో తగ్గుదల ఉండదు!
గతేడాదితో పోలిస్తే ఈసారి మార్కులు తక్కువ వచ్చినా ర్యాంకులో తగ్గుదల ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘గతేడాది అఖిల భారతస్థాయిలో 502 మార్కులకు 2 లక్షల ర్యాంకు వచ్చింది. జనరల్ కేటగిరీలో సీటు దక్కింది. ఈసారి 405 మార్కులు వచ్చిన వారికి అదే 2 లక్షల ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఐదారు మార్కులు అటుఇటుగా వచ్చినా జనరల్ కేటగిరీలో ఈసారి సీటు దక్కే అవకాశం ఉంది’’ అని శ్రీచైతన్య డీన్ శంకర్‌రావు విశ్లేషించారు.
తెలంగాణ విద్యార్థుల ర్యాంకులు మెరుగు
- గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్ర విద్యార్థుల నీట్ ర్యాంకులు మెరుగయ్యాయి. 2024లో రాష్ట్రానికి వందలోపు ఒకే ఒక్క ర్యాంకు (77) రాగా... ఈసారి వందలోపు 5 ర్యాంకులను మన విద్యార్థులు సాధించారు.
 - బాలికల టాప్ 20 ర్యాంకర్లలో రాష్ట్రం నుంచి ఇద్దరమ్మాయిలు ఉన్నారు. 95వ ర్యాంకర్ బిదిష మజీ, 108వ ర్యాంకర్ బ్రాహ్మణి రెండ్ల ఈ ఘనత సాధించారు.
 - మంగారి వరుణ్ (46వ ర్యాంకు) ఓబీసీ కేటగిరీలో జాతీయస్థాయిలో పదో స్థానంలో నిలిచాడు.
 - రెడ్డిమల్ల శ్రీశాంత్ (147వ ర్యాంకు) ఎస్సీ కేటగిరీలో 3వ స్థానంలో నిలిచాడు.
 - ఎస్టీ విభాగంలో పూజారి హాసిని (377వ ర్యాంకు) 3వ స్థానం, బానోత్ ధీరజ్‌కుమార్ (1178 ర్యాంకు) 8వ స్థానంలో నిలిచారు.
 - గతేడాది 1683 మంది నీట్‌ను తెలుగు మాధ్యమంలో రాయగా.. ఈసారి 907 మంది మాత్రమే తెలుగులో రాశారు.
 
డాక్టర్ కావడమే లక్ష్యం
- కాకర్ల జీవన్‌సాయికుమార్, 18వ ర్యాంకు
మా స్వస్థలం తణుకు. శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో 18వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు అనుగుణంగా సన్నద్ధమయ్యా. మా కుటుంబంలో ఇప్పటివరకూ ఎవరూ వైద్యులు లేరు. మంచి విద్యాసంస్థలో చేరి, భవిష్యత్తులో పేదలకు సేవచేస్తా.
బాల్యం నుంచి కలలు కన్నా
- అక్షింతల షణ్ముఖనిషాంత్, 37వ ర్యాంకు

డాక్టర్‌గా సేవలందించాలని బాల్యం నుంచి కలలుకన్నా. ఇందుకు ఆది నుంచీ శ్రమించి చదువుతున్నా. అమ్మానాన్నలు, అధ్యాపకులు ప్రోత్సహించారు. నీట్ ర్యాంకుతో నా కల నేరవేరబోతోంది. కళాశాలలో ఇచ్చిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదువుకున్నా. తగినంత సమయం కేటాయించా.
నాన్నే స్ఫూర్తి.. 
- వరుణ్, 46వ ర్యాంకు, నాగోలు, హైదరాబాద్

నాన్న వంశీకృష్ణ జనరల్ ఫిజిషియన్.. నేను బాల్యం నుంచి నాన్న సేవలను చూస్తున్నాను. ఆయనే స్ఫూర్తిగా డాక్టర్ కావాలని కలలు కన్నా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తా. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది నా కోరిక.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో
- బిదిష, 95వ ర్యాంకు

ఈ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఇందుకు నా కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేను. వైద్యురాలిగా స్థిరపడి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తా.
- ఈనాడు డిజిటల్, హైదరాబాద్;
రాయదుర్గం, న్యూస్‌టుడే
స్పష్టమైన ఆశయంతో కృషి
- ఏపీ టాపర్ కార్తీక్‌రామ్, 19వ  ర్యాంకు 

మాది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం. మా నాన్న డాక్టర్ అరుణ్‌కుమార్ ఈఎన్‌టీ వైద్యనిపుణులు. తల్లి కృష్ణకాంత్‌లత గృహిణి. చిన్ననాటి నుంచి వైద్యుడు కావాలనేది నా కల. దాన్ని నెరవేర్చుకునేందుకు రోజుకు 14 గంటలకు పైగా చదివా. దిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా సిద్ధమయ్యా.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 


