Kavitha: రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కవిత

Eenadu icon
By Telangana News Team Published : 20 Sep 2025 12:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదు.. భయపడుతున్నారేమో? కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌రావుపై నాకు వేరే కోపం లేదు. ఇరిగేషన్‌పై 2016లోనే కేటీఆర్‌కు సూచించాను. నేరుగా సీఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని కేటీఆర్‌కు చెప్పా. కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయి. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే.

సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున మేము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్‌ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు. పదేళ్లలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయాం. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణకు వెళ్లాలి. భారత రాష్ట్ర సమితి పార్టీ, హరీశ్‌రావు, సంతోష్‌ సోషల్‌మీడియాలు నాపైనే దాడి చేస్తున్నాయి. నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరా. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది. కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాం. ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటా’’ అని కవిత తెలిపారు. (Telangana News)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు