Kishan Reddy: ధైర్యముంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయండి

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Nov 2025 05:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి సవాల్‌
ముఖ్యమంత్రి హద్దులు దాటి మాట్లాడుతున్నారని ధ్వజం

షేక్‌పేట నాలా అంబేడ్కర్‌నగర్‌లో ప్రచారంలో భాగంగా ఓ యువకుడికి కరపత్రం అందజేస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌- అమీర్‌పేట, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి హద్దులు దాటి మాట్లాడుతున్నారని... కాంగ్రెస్‌కు ఓటేయకపోతే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకమని... ధైర్యముంటే రద్దు చేసి చూపాలని సవాల్‌ విసిరారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డితో కలిసి యూసుఫ్‌గూడ సమీపంలోని కృష్ణకాంత్‌ పార్కులో పర్యటించి... యోగా సాధకులు, కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. షేక్‌పేట డివిజన్‌ పరిధిలోని నాలా అంబేడ్కర్‌నగర్, బీజేఆర్‌నగర్, ఎంజీనగర్‌లలో సాయంత్రం ఇంటింటి ప్రచారం చేశారు. ఆయా సందర్భాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా.. గెలుస్తామో లేదోనన్న అనుమానంతో, భయంతో.. కాంగ్రెస్‌కు ఓటేయకపోతే సన్న బియ్యం పంపిణీ మానేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెదిరించడం సరికాదు.

దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రతి కిలోకు రూ.42 చొప్పున ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.15 మాత్రమే భరిస్తోంది. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైంది. భాజపాపై అబద్ధాల ప్రచారంతో ఓ వర్గం ఓట్లు రాబట్టుకోవాలని కుట్ర పన్నుతోంది. దేశ సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిలకు అలవాటే. సైనికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే. జూబ్లీహిల్స్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేసి, రోడ్లు వేసిన తర్వాతే సీఎం ఓట్లు అడగాలి. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిల మధ్య దిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరింది. అందుకే ఏ రోజూ భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మాట్లాడటం లేదు. ఒక్క కేసులోనూ భారత రాష్ట్ర సమితిపై చర్యలు లేవు. మెట్రో రైలును అడ్డుకుంటున్నారంటూ నాపై రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మెట్రో నడపలేమని ఎల్‌ అండ్‌ టీ చెబుతోంది. ఆ సంస్థ ఎండీతో మీరే ఫొటోలు దిగారు. మెట్రోను టేకోవర్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా నన్ను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కన్నా కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎంలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. మూడు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో వారు విసుగు చెందారు. సమస్యల పరిష్కారం భాజపాతోనే సాధ్యం’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

కళాశాలల ధర్నాకు భాజపా మద్దతు: అంజిరెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కాంగ్రెస్‌ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యాలు సోమవారం నుంచి చేపట్టనున్న ధర్నాకు భాజపా మద్దతు ఇస్తోందన్నారు. సర్కారు స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :
Published : 03 Nov 2025 04:43 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు