Climate Changes: వాతావరణ మార్పులు.. ప్రాణాలు తోడేస్తున్నాయ్‌..

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 03:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

‘ఈనాడు’ ఇంటర్వ్యూలో లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మరినా రొమానెల్లో
గతంలో ఎన్నడూ లేనంతగా చాలా ఆందోళనకరంగా పరిస్థితులు
బొగ్గు మండించడం వల్ల ప్రపంచంలో ఏడాదికి 25 లక్షల మరణాలు 
వాయు కాలుష్యంతో 2024లో రికార్డు స్థాయిలో లక్షా 54వేల మంది మృత్యువాత 
కళ్లు తెరవని ప్రభుత్వాలు
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

‘అధిక ఉష్ణోగ్రతలు.. రికార్డు స్థాయిలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు.. బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాలు వెదజల్లే వాయు కాలుష్యం ప్రపంచంలో మానవాళికి ప్రమాదకరంగా తయారయ్యాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని వివరిస్తున్నారు... యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ విభాగం సీనియర్‌ పరిశోధకురాలు డాక్టర్‌ మరినా రొమానెల్లో. ప్రముఖ వైద్య జర్నల్‌ లాన్సెట్, లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ పేరుతో వాతావరణ మార్పులు, ఆరోగ్య రంగంపై ప్రభావం-2025 అధ్యయనానికి ఆమె ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ఆయా సమస్యలపై 20 అంశాలను ప్రామాణికంగా తీసుకొని అధ్యయనం చేస్తే ఇందులో 12 గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. భారత్‌లోనూ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. ఆమె ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

మీ అధ్యయనంలో తేలిన ప్రధానాంశాలు ఏంటి ?

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం ఆరోగ్య రంగంపై ఎలా ఉందో తెలుసుకోవడానికి లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌-2025 అధ్యయనం జరిగింది. వాతావరణ మార్పులు, ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు.. రెండూ తీవ్ర రూపం దాల్చాయి. ఆందోళనకరమైన అంశమేంటంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల మరణాలు పెరగడంతోపాటు అంటు వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి. పర్యవసానంగా మరణాలు పెరుగుతున్నాయి. ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వాతావరణ మార్పులకు మానవ చర్యలు, కర్బన ఉద్గారాలు, బొగ్గును కాల్చడం వంటివి ఎక్కువ కారణమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉండటమే కాదు, కర్బన ఉద్గారాలు కూడా తీవ్రస్థాయికి చేరాయని తాజా సమాచారాన్ని బట్టి స్పష్టమవుతోంది. 

ప్రభుత్వాల చర్యలు దిద్దుబాటు దిశగా ఉంటున్నాయా ?

బొగ్గు మండించడం వల్ల వాతావరణ కాలుష్యంతో ఏడాదికి 25 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. 2024లో వాయు కాలుష్యంతో రికార్డు స్థాయిలో లక్షా 54వేల మరణాలు నమోదయ్యాయి. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉండగా ప్రభుత్వాలు, కంపెనీలు గ్యాస్, ఆయిల్‌ ఉత్పత్తి కార్యక్రమాలను ఇంకా పెంచాయి. ఇది భవిష్యత్తును మరింత భయాందోళనలకు గురి చేయడమే కాదు, ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 100 ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీల షేర్‌హోల్డర్లు సమావేశమై ప్రతి సంవత్సరం విస్తరించాలని నిర్ణయించారు. ప్రధాన బ్యాంకులు కూడా వీటి విస్తరణకు భారీగా రుణాలు ఇస్తున్నాయి. 2023-24 కంటే 2024-25లో 29 శాతం ఎక్కువగా ఇచ్చాయి. 600 బిలియన్‌ డాలర్ల రుణాలు మంజూరు చేశాయి. గ్రీన్‌ ఎకానమీకి ఇచ్చే రుణాలు పెరగడం లేదు. ప్రభుత్వాలు పూర్తిగా ఈ అంశాన్ని విస్మరించాయి. అమెరికా సహా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువయ్యాయని ఈ అధ్యయనం తేల్చింది. 

వాతావరణ మార్పుల ప్రభావం 65 ఏళ్ల వయసు దాటిన వారిపై, ఏడాదిలోపు వయసున్న పిల్లలపై ఏ స్థాయిలో ఉంది ?

2020-24 మధ్య సరాసరిన ఏడాదికి 16 రోజులు ప్రాణాలకు ముప్పుగా ఉండే తీవ్ర ఉష్ణోగ్రతలను, వడగాడ్పులను ప్రజలు ఎదుర్కొన్నారు. 1986-2005 సంవత్సరాల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన రోజులను సరాసరిగా తీసుకొంటే 2024లో ఏడాది లోపు వయసున్న పసి పిల్లలు 389 శాతం ఎక్కువగా వీటి తీవ్రతలను ఎదుర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన పెద్దల్లో ఇది 304 శాతం ఎక్కువ. ప్రధానంగా ఇంటి వసతి లేని వారు, పేదలు ఎక్కువగా ఉంటున్నారు. మా డేటా ప్రకారం కార్మికులు తమ పని దినాలను, ఉపాధి అవకాశాలను భారీగా కోల్పోతున్నారు. తక్కువ ఆదాయం, తక్కువ మానవాభివృద్ధి సూచికలు గల దేశాలు ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతున్నాయి. ఈ దేశాల వారు మళ్లీ కోలుకోలేని పరిస్థితి. ఈ దేశాల్లో 97 శాతం నష్టాలకు బీమా కూడా లేదు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 61 శాతం భూభాగం తీవ్ర కరవును ఎదుర్కొంది. 1950వ దశకంతో పోల్చితే ఇది 299 శాతం ఎక్కువ. దీంతో ఆహారభద్రత, నీటి సమస్యలు ఎదురయ్యాయి.

భారతదేశంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ ఒకటి. జనాభా కూడా ఎక్కువ కావడంతో ప్రభావం ఎక్కువ. ఈ కారణంతో మరణాలు కూడా పెరిగాయి. కార్మికుల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. భారీగా పనిదినాలు కోల్పోయారు. అంటు వ్యాధులు బాగా పెరిగాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల డెంగీ కూడా పెరిగింది. దోమల కారణంగా వచ్చే వ్యాధులూ ఎక్కువయ్యాయి. 

గతంలో జరిగిన అధ్యయనాలతో పోల్చితే ఈ అధ్యయనానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి ?

వాతావరణ మార్పులు ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఎక్కువ అంశాలతో మా అధ్యయనం సాగింది. ఈ కారణంగా సంభవించే మరణాల సంఖ్యను తేల్చడమే కాకుండా, ఇందుకు గల కారణాలను లోతుగా విశ్లేషించాం. ఆరోగ్యంపై ఎంత తీవ్ర ప్రభావం ఉంటోంది, ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకున్నాం. భారత్‌ ఇంధన అవసరాలకు శిలాజ ఇంధనాలపై (ఫాసిల్‌ ఫ్యూయల్స్‌పై) ఆధారపడుతోంది. ఈ ఇంధనాలు ఎక్కువగా వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులకు గురయ్యేవారిలో నిద్ర నాణ్యత కూడా ఓ ప్రధాన సమస్య. వారి శారీరక, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. 

కర్బన ఉద్గారాలను తగ్గిస్తే ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయి ?

వాతావరణ మార్పుల అంశంపై దృష్టి పెడితే లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఉదాహరణకు భారత్‌లో మొత్తం 40 శాతం విద్యుత్తు అవసరాలు, కొన్ని రాష్ట్రాల్లోని 70 శాతం అవసరాలు బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాలతో తీరుతున్నాయి. ఇవి ఎక్కువ వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయగలిగితే కనీసం పది లక్షల మరణాలను తగ్గించవచ్చు. ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిపై భారత్‌ దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. చైనా కూడా ఈ దిశలో ప్రయత్నం చేస్తోంది. అనేక దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టి ఫలితాలు సాధించాయి. అనేక దేశాల్లో స్థానికంగా ఉండే సమూహాలు(కమ్యూనిటీస్‌), స్థానిక ప్రభుత్వాలు మంచి చొరవ చూపుతున్నాయి. ఇది మంచి పరిణామం. కొన్ని సార్లు ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలను కాదని సమూహాలు వాతావరణ మార్పుల నుంచి రక్షించుకొంటున్నాయి. కొన్ని ప్రభుత్వాలు ఈ నివేదికలను సీరియస్‌గా తీసుకొని విధాన రూపకల్పనలో వినియోగించుకొంటున్నాయి.


ప్రపంచంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 2024లో రికార్డు స్థాయిలో 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. ఇది ప్రీ ఇండస్ట్రియల్‌ పీరియడ్‌ కంటే ఎక్కువ. కర్బన ఉద్గారాలూ రికార్డు స్థాయిలో విడుదలయ్యాయి. 65 ఏళ్ల వయసు దాటిన వారు, ఏడాదిలోపు వయసున్న పసి పిల్లలు తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు తీవ్ర అనారోగ్యంపాలవుతున్నారు. మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వాతావరణ కాలుష్యం, పొగ కారణంగా ఇంకా ఎక్కువ మంది చనిపోతున్నారు.

డాక్టర్‌ మరినా రొమానెల్లో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు