Rice Millers: సరకు సర్కారుది.. సోకు మిల్లర్లది..

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బియ్యాన్ని దారి మళ్లిస్తున్న మిల్లర్లు
కనిపించని ధాన్యం 4.49 లక్షల క్వింటాళ్లు.. విలువ రూ.103 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల నుంచి ధాన్యం కొనేందుకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ పౌరసరఫరాల సంస్థ నష్టాల పాలవుతుంటే కొందరు మిల్లర్లు ఆ వడ్లతో వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు పంపి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వమంటే.. కొందరు ఆ బియ్యాన్ని నౌకాశ్రయాలకు, అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి 4.49 లక్షల క్వింటాళ్ల ధాన్యం కనిపించకుండా పోయింది. దీని విలువ సుమారు రూ.103 కోట్లకు పైమాటే. 

ఉద్దేశపూర్వకంగానే వ్యాపారం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల, మునుగోడు, నల్గొండలోని 6 రైస్‌మిల్లుల నుంచి ప్రభుత్వధాన్యం ఏపీలోని కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించారంటూ 2025 మే 24న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి ఫిర్యాదు అందింది. దీనిపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు అధికారులు విచారణ ప్రారంభించారు. నల్గొండ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కన్వీనర్‌గా, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, నల్గొండ ఆర్డీవో, తహసీల్దార్, తూనికలు- కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్‌.. ఈ కమిటీ ఆరు మిల్లుల్లో తనిఖీలు చేసింది. 2022-23 రబీ సీజన్‌లో మిల్లులకు కేటాయించిన ధాన్యం.. మిల్లర్లు తిరిగి ఇచ్చిన బియ్యం (సీఎంఆర్‌).. మిల్లుల్లో ఇంకా ఉండాల్సిన ధాన్యం వివరాలు సేకరించారు. ఆరు మిల్లుల్లో మొత్తం 4.49 లక్షల క్వింటాళ్ల ధాన్యం లేదని గుర్తించారు. దీనిపై నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్‌.. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఇటీవల నివేదిక సమర్పించారు. ఉద్దేశపూర్వకంగానే వ్యాపారం చేశారని నివేదికలో స్పష్టం చేశారు. ఆయా మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. గౌతమి ఇండస్ట్రీస్‌ (నల్గొండ)లో 1,59,803.92 క్వింటాళ్ల వడ్లు, కనక మహాలక్ష్మి పారాబాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ (నల్గొండ) 80,260.59 క్వింటాళ్లు, రామలక్ష్మణ్‌ పారాబాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ (నల్గొండ) 78,110.40 క్వింటాళ్లు, సుమాంజలి పారాబాయిల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (నల్గొండ) 67662.11 క్వింటాళ్లు, వరలక్ష్మి పారాబాయిల్డ్‌ రైస్‌మిల్‌ (చిట్యాల) 59,538.52 క్వింటాళ్లు, మురళీ మనోహర అగ్రోఫుడ్‌ ప్రొడక్ట్స్‌ (మునుగోడు)లో 4500 క్వింటాళ్ల ధాన్యం కనిపించలేదని నివేదికలో పేర్కొన్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం ఉందా లేదా అనే విషయమై స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలకు సిఫార్సు చేయాలి. కానీ ఒక్కో మిల్లులో వేలు, లక్షల క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లుతుంటే స్థానిక అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ ఆరు మిల్లుల్లో 2022-23 నాటి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ, చర్యలకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు