Sudarshan Reddy: ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Desk Updated : 01 Nov 2025 04:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌రావు
క్యాబినెట్‌ హోదాతో ఇద్దరికి పదవులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి పదవులు ఆశిస్తున్న ఇద్దరు నాయకులకు ప్రభుత్వం తాజాగా క్యాబినెట్‌ స్థాయి హోదాలిస్తూ పదవులు కట్టబెట్టింది. మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డిని సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఇద్దరినీ క్యాబినెట్‌ హోదాలో నియమించగా, సుదర్శన్‌రెడ్డి మాత్రం అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని పేర్కొంది. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నాయకులిద్దరికీ మొదటి నుంచీ మంత్రివర్గంలో స్థానం ఇస్తారన్న అంచనాలుండేవి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి.. అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఈ ఇద్దరికీ క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ పదవులు ఇవ్వడం, వారిలో ఒకరికి మంత్రులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకొంది. రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించడానికి వీలుండగా, అజారుద్దీన్‌కు మాత్రమే ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. 

ఆది నుంచీ రేసులో వారిద్దరు... 

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు కూడా. కానీ అధిష్ఠానం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యంగా అమలు చేసే అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారునిగా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమాల అమలుపై జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులతో ఆయన సమీక్షించవచ్చు.

సుదర్శన్‌రెడ్డికి మంత్రులతోపాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని, సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్స్‌ దగ్గరే ఆయన ఛాంబర్‌ కూడా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని తెలిపింది. ప్రభుత్వం ప్రాధాన్యంగా అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల యూనిట్‌కు... ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి స్థాయి అధికారి అధిపతిగా ఉంటూ.. సలహాదారుకు సహకరిస్తారని, ఆయా పథకాల అమలు తీరుపై ఈ యూనిట్‌ ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి నివేదిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మొదటి నుంచీ మంత్రివర్గంలో స్థానం కోసం పట్టుపడుతున్నారు. తాజాగా ఆయనకు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ పదవి దక్కింది. అయితే ఆయన దీంతో సంతృప్తి చెందుతారో లేదో చూడాల్సి ఉంది. 


ఇక విస్తరణ ఉండదా? 

ఇప్పటికే ప్రత్యేక సలహాదారుగా ఉన్న కె.కేశవరావుకు క్యాబినెట్‌ హోదా ఉంది. సీఏం ముఖ్య సలహాదారు సహా మిగిలిన సలహాదారులకు ఆ హోదా లేదు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షునిగా ఉన్న చిన్నారెడ్డి మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానితులుగా ఉండగా, ఇప్పుడు సుదర్శన్‌రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ప్రస్తుత నియామకాలతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇంకా మరికొందరు మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉందా లేక ఆహ్వానితులుగా ఉన్న వారితో కలిసి గరిష్ఠ సంఖ్యకు చేరినందున కొత్తగా ఎవరికీ అవకాశం ఉండదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags :
Published : 01 Nov 2025 03:40 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని