Coal India: కోల్‌ ఇండియా సీఎండీగా తెలుగుతేజం సాయిరాం!

Eenadu icon
By Telangana News Desk Published : 21 Sep 2025 04:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్రానికి ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల బోర్డు సిఫార్సు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగుతేజం బి.సాయిరాం బొగ్గు రంగంలో ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా సీఎండీగా ఎంపికయ్యారు. వైజాగ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ సంస్థకు సీఎండీగా పనిచేస్తున్నారు. కోల్‌ ఇండియా సీఎండీ పదవి భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల బోర్డు మౌఖిక పరీక్షల్లో సాయిరాంను ఎంపిక చేసింది. ఈ మేరకు బోర్డు.. శనివారం నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పదవి కోసం దేశవ్యాప్తంగా 11 కీలక సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు పోటీపడగా సాయిరాం మౌఖిక పరీక్షల్లో నెగ్గినట్లు బోర్డు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి ఆయన పేరును సిఫార్సు చేసినట్లు తెలిపింది. ప్రధాని ఆమోదం తరవాత నియామక ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు వివరించాయి.

జాతీయ బొగ్గు రంగంలో కీలక పదవి

గతంలో కోల్‌ ఇండియా సీఎండీగా తెలంగాణకు చెందిన నర్సింగరావు పనిచేసి రాష్ట్రం ఏర్పడిన తరవాత అప్పటి సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా వచ్చారు. ప్రస్తుతం కేంద్ర బొగ్గుశాఖ మంత్రిగా తెలంగాణ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈ శాఖలో అత్యంత కీలకమైన కోల్‌ఇండియా సీఎండీ పదవికి కూడా మరో తెలుగువ్యక్తి ఎంపిక కావడం విశేషం. సాయిరాం రాయపుర్‌ ఎన్‌ఐటీలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చేశారు. సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ సంస్థలో టెక్నికల్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. బొగ్గు రంగంలో అపారమైన అనుభవం ఉన్నందున ఆయనను కోల్‌ఇండియా అధిపతిగా బోర్డు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2024-25)లో సంస్థ 781 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. దేశంలో మొత్తం అన్ని బొగ్గు సంస్థలు కలిపి ఉత్పత్తి చేసింది 1,047 మిలియన్‌ టన్నులైతే అందులో కోల్‌ఇండియా వాటానే 781 మిలియన్‌ టన్నులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు