Telangana News: విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే ఫీజులు..!

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 05:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రతిపాదనలు పరిశీలిస్తున్న సంక్షేమశాఖలు
ఎస్సీ విద్యార్థుల తరహాలో అమలుకు కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఏళ్లుగా బోధన రుసుములు సకాలంలో చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయిలు.. వాటి మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని కొన్ని కళాశాలలు అవకాశంగా తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మేరకు సమాలోచనలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్కరణ మేరకు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా బోధన ఫీజులు, ఉపకారవేతనాలు జమ చేస్తోంది. ఇదే విధానాన్ని మిగతా సంక్షేమ విభాగాల్లోనూ అమలుకు సాధ్యాసాధ్యాలను ఆయా సంక్షేమశాఖలు పరిశీలిస్తున్నాయి. 

ఏటా రూ.2,400 కోట్లకు పైగా..

కోర్సు ముగియగానే ధ్రువపత్రాలను ఇవ్వడానికి విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు.. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక వాటిని తిరిగి విద్యార్థులకు చెల్లించడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు మంజూరు కాలేదని, వాటిని చెల్లించేవరకు ధ్రువపత్రాలు ఇవ్వబోమని చెబుతున్నాయి. ఫిర్యాదులపై పరిశీలించిన సంక్షేమశాఖలు.. విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా జమచేసే ప్రతిపాదనను ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి. రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం ఏటా 12.5 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారని, ఏటా డిమాండ్‌ రూ.2,400-2,600 కోట్ల వరకు ఉంటోందని తెలిపారు. 

ఒకే విధానంలో..

ఎస్సీ విద్యార్థులకు ఏటా బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. వెంటనే కేంద్రం 60% నిధులు చెల్లిస్తుంది. ఈ మొత్తం నుంచి విద్యార్థులకు ఫీజులు మంజూరవుతాయి. ఎస్టీ విద్యార్థులకు కేంద్రం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తోంది. వీరికి విద్యార్థుల ఖాతాల్లో నేరుగా చెల్లించే విధానం అమలుచేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే బోధన ఫీజులు, ఉపకారవేతనాలు భరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా చెల్లింపులు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బోధన ఫీజులకు ఒకే విధానం అమలవుతుందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని