singur dam: రెండేళ్లపాటు ఖాళీగానే ‘సింగూరు’!

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

డిసెంబరు మొదటి వారం నుంచి మరమ్మతులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు

ఈనాడు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లోని సింగూరు జలాశయానికి మరమ్మతులు చేపట్టేందుకు హైదరాబాద్‌ నగర ప్రజారోగ్య, పురపాలక ఇంజినీరింగ్‌ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇటీవల నీటిపారుదల, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలాశయం ఆనకట్ట రివిట్‌మెంట్‌లో పగుళ్లు ఏర్పడినట్లు ఎన్‌డీఎస్‌ఎ (నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ) 

నిర్ధారించి.. సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో డ్యాంలో ప్రస్తుతమున్న 16 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలని తొలుత ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా జలాశయాన్ని మొత్తం ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో నవంబరు నెలాఖరులోపు రిజర్వాయర్‌ను ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు-2025 నుంచి రెండేళ్ల పాటు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసే అవకాశాలుండవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డ్యాం మరమ్మతుల నిమిత్తం రూ.16 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. టెండర్లు ఖరారు కావడంతో గుత్తేదారు పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ రిజర్వాయర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఏడు టీఎంసీలు, మిషన్‌ భగీరథకు ఆరు టీఎంసీల నీటిని కేటాయించారు. దీంతోపాటు సంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టుకు నాలుగు టీఎంసీలను విడుదల చేస్తున్నారు. మరమ్మతుల నేపథ్యంలో జలాశయంలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని మొత్తం విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాలో  ఆటంకాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో నీటిపారుదల శాఖకు సూచించారు. తాగునీటి సరఫరాకు అవసరమైనచోట ప్రత్యేకంగా బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని పేర్కొన్నారు. 

ఆనకట్టకు మరమ్మతులు చేపట్టాల్సిన ప్రాంతం


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం

ప్రజారోగ్య, పురపాలక ఇంజినీరింగ్‌ శాఖల అధికారులు ఇటీవల టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి జలాశయం ఖాళీ చేసి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే నెలాఖరులోపు రిజర్వాయర్‌ను ఖాళీ చేయాలని నిర్ణయించాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. దిగువకు నీటిని విడుదల చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేలా భగీరథ యంత్రాంగానికి తోడ్పాటునందిస్తాం. 

శ్రీనివాస్, ఇన్‌ఛార్జి సీఈ,  నీటిపారుదల శాఖ, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు