Ghost Jobs: వారికదో తుత్తి.. ఉత్తుత్తి ఖాళీలతో ఉద్యోగ ప్రకటనలు

Eenadu icon
By Telangana News Desk Updated : 25 Nov 2025 19:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

రాము ఒక వెబ్‌సైట్‌లో కనిపించిన ఉద్యోగ ప్రకటన నచ్చి దానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుకున్నాడు. రోజులు, వారాలు గడిచిపోయాయి కానీ    ఆ కంపెనీ నుంచి అతనికి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత రెండు నెలలకు ఆ కంపెనీ నుంచే అదే అర్హతలను అడుగుతూ మరో ప్రకటన వచ్చింది. ఈ సారైనా ఉద్యోగం వస్తుందేమోననుకొని దరఖాస్తు చేసుకుంటే... ఈసారీ అవే ఎదురుచూపులు.. 

రామునే కాదు ఈ మధ్య కాలంలో ఇలాంటి అనుభవాన్ని చాలామంది యువత ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇవి ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఇస్తున్న సిసలైన ప్రకటనలు కావు. అంటే ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీలకు ప్రకటనలన్నమాట. జాబ్‌మార్కెట్లో వీటిని ‘ఘోస్ట్‌ జాబ్స్‌’గా వ్యవహరిస్తుంటారు. 

ఎందుకిలా చేస్తాయి... 

కంపెనీలు ఈ తరహా ‘ఘోస్ట్‌ జాబ్స్‌’ ప్రకటనలు ఇస్తుండటం వెనక పలు కారణాలు, వ్యూహాలు దాగి ఉంటాయి..  

  • రెజ్యూమేలోని ఉద్యోగ అభ్యర్థుల వివరాలను సేకరించి కంపెనీలు భద్రపర్చుకుంటాయి. తద్వారా భవిష్యత్తులో చేపట్టే నియామకాల సమయంలో ఆ వివరాల ఆధారంగా తగిన అర్హతలున్న అభ్యర్థులను పిలుస్తాయి. నియామకాల ప్రక్రియ సమయాన్ని తగ్గించుకోవచ్చన్నది ఆ కంపెనీల ఉద్దేశం.   
  • ఉద్యోగ విపణిలోని పరిస్థితుల అధ్యయనానికి, నిపుణుల లభ్యతపై అంచనాకు వచ్చేందుకు, భవిష్యత్తులో నియామక వ్యూహాల మార్గనిర్దేశం కోసం ఈ మార్గాన్ని కంపెనీలు వాడుకుంటున్నాయి. 
  • ఉద్యోగ ప్రకటనలను తరచూ ఇస్తుండడం ద్వారా కంపెనీ పనితీరు బాగుందనే అభిప్రాయాన్ని, ప్రస్తుత ఉద్యోగుల్లో కలగజేయొచ్చని కూడా ఇలా చేస్తుంటాయి. తద్వారా ఉద్యోగుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు, వేరే కంపెనీలకు వలసపోకుండా నియంత్రించేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందన్నది వాటి భావన. 
  • ఉద్యోగ ప్రకటనలతో సంస్థ పనితీరు బాగుందనే సంకేతం ఇవ్వడం ద్వారా వాటాదార్లు, వినియోగదార్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవచ్చన్నది దీని వెనక మరో ఉద్దేశం. 

మోసం కాదా?

  • లేని ఉద్యోగ ఖాళీలకు ప్రకటనలు ఇవ్వడం ద్వారా కంపెనీలకు కొన్ని విధాలా ప్రయోజనం ఉండొచ్చేమో కానీ ఉద్యోగార్థులను మాత్రం ఇది తప్పుదోవ పట్టించడమే. 
  • అయితే డబ్బులు వసూలు చేయడం లాంటివి లేనందున.. ఇలాంటి ప్రకటనలను మోసం కిందకు చూడరాదనే వాదనను కొన్ని కంపెనీలు వినిపిస్తున్నాయి. 

దుష్ఫలితాలున్నాయ్‌...

  • ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీల ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఉద్యోగార్థుల శ్రమ వ్యర్థం అవుతోంది. వాళ్లలో నిరాశ నిస్పృహను పెంచుతోంది. 
  • ఉద్యోగార్థులు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియక అసలైన వాటికి కూడా దరఖాస్తు చేసుకోలేరు. అలా మంచి ఉద్యోగాలను కూడా వాళ్లు కోల్పోవచ్చు. 
  • తరచూ ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీల ప్రకటనలు ఇస్తే.. కంపెనీల బ్రాండ్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరమైన సమయంలో సరైన నిపుణులు దొరకకపోతే కంపెనీ పనితీరు దెబ్బతింటుంది. 

మరేం చేయాలి?

  • ఉత్తుత్తి ఉద్యోగ ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ పోర్టల్‌లో వారాలకు వారాలు లేదా నెలల పాటు ఒక ఉద్యోగ ప్రకటన కొనసాగినా లేదా పునరావృతమైనా దానిని విస్మరించాలి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు, సంప్రదించేందుకు చిరునామా లేదా ఫోన్‌ నెంబర్లు ఇవ్వకున్నా వాటిని పట్టించుకోవద్దు. 
  • ఏదైనా కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే.. ముందుగా ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో నియామకాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా? లేదా? పరిశీలించుకోవాలి. అవసరమైతే స్థానిక కార్యాలయానికి వెళ్లి కనుక్కోవాలి.  
  • ఘోస్ట్‌ జాబ్స్‌ ప్రకటనల మార్గాన్ని కొందరు మోసం చేసేందుకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు కృత్రిమ మేధను, సామాజిక మాధ్యమాలను వాళ్లు విరివిగా వాడుకోవచ్చు. అందువల్ల ఎవరైనా ఉద్యోగం ఉందని ఆశజూపి ముందుగా డబ్బులు పంపించాలని అడిగినా, బ్యాంకు, ఆధార్‌ లాంటి వ్యక్తిగత వివరాలు అడిగినా స్పందించకూడదు. 

ఈ రంగాల్లో ఎక్కువ..

నిర్మాణం, సాంకేతికత, న్యాయసేవలు, ఆహార, ఆతిథ్యం, తయారీ, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌. చిన్న, మధ్య తరహా కంపెనీల నుంచే ఇలాంటి   ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయి. 

ఈనాడు, బిజినెస్‌ డెస్కు

Tags :
Published : 25 Nov 2025 19:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని