PG Medical: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే

Eenadu icon
By Telangana News Desk Updated : 02 Nov 2025 04:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఎంక్యూ1లో ఇకపై 15 శాతమే అఖిల భారత కోటాకు
జీవో తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పీజీ వైద్యవిద్య యాజమాన్య కోటాలో స్థానిక విద్యార్థులకు అత్యధిక సీట్లు దక్కనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో వందల మంది తెలంగాణ విద్యార్థులకు మేలు జరగనుంది. ఇప్పటి వరకు ప్రయివేటు పీజీ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లన్నీ అఖిల భారత కోటా విద్యార్థులకే దక్కేవి. ఈ విధానంతో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, యాజమాన్య కోటాలో 85% సీట్లు మన విద్యార్థులకే కేటాయించేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తీసుకెళ్లారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించి వెంటనే స్థానిక విద్యార్థులకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. ఈ క్రమంలో జీవో జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. కాళోజీ వర్సిటీ నిర్వహించనున్న పీజీ కౌన్సెలింగ్‌లో ఇకపై మన వారికి యాజమాన్య కోటాలో అదనంగా లబ్ధి కలగనుంది. ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్‌ పీజీ, 70 డెంటల్‌ పీజీ సీట్లు దక్కనున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో స్థానిక విద్యార్థులకు అధిక ప్రాధాన్యం దక్కేలా జీవో 33ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల్లో 50% సీట్లను అఖిల భారత కోటాలో, మిగతా 50% సీట్లను కన్వీనర్‌ కోటాలో స్థానికులతో భర్తీ చేస్తున్నారు. మనరాష్ట్రంలో ఉన్న 19 ప్రయివేటు పీజీ వైద్య కళాశాలల్లో 1,511 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలోని సగం సీట్లను కన్వీనర్‌ కోటా కింద స్థానికులకు కేటాయిస్తున్నారు. మిగతా సగం సీట్లను... ఎంక్యూ1, ఎంక్యూ2 (ఎన్‌ఆర్‌ఐ), ఎంక్యూ3 (ఇన్‌స్టిట్యూషనల్‌) కోటాల కింద భర్తీ చేస్తారు. ఇందులో ఎంక్యూ1కు 25% సీట్లు ఉండగా... ఎంక్యూ2, ఎంక్యూ3 రెండింటికీ కలిపి 25% సీట్లు ఉంటాయి. ఇప్పటివరకు ఎంక్యూ1 కింద భర్తీ చేస్తున్న మొత్తం సీట్లను ఆల్‌ ఇండియా కోటాకే కేటాయిస్తున్నారు. ఈ ఎంక్యూ1లోని 85% సీట్లను లోకల్‌ విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్‌ వైద్యుల సంఘం సైతం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది.

Tags :
Published : 02 Nov 2025 04:07 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు