Dog bites: మూడేళ్లలో కుక్కకాటు బాధితులు 3.33 లక్షల మంది

Eenadu icon
By Telangana News Desk Updated : 28 Oct 2025 05:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అందులో 36 మంది మృతి..
రాష్ట్రంలో పరిస్థితిపై సుప్రీంకోర్టుకు పట్టణాభివృద్ధిశాఖ అఫిడవిట్‌

ఈనాడు, దిల్లీ: తెలంగాణవ్యాప్తంగా గత మూడేళ్లలో 3.33 లక్షల మంది వీధికుక్కల కాటు బారిన పడ్డారని, వారిలో 36 మంది మరణించారని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ వెల్లడించింది. వీధికుక్కల నియంత్రణపై రాష్ట్రాల అభిప్రాయం కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం గత ఆగస్టులో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కుక్కల నియంత్రణకు వీలుగా నిబంధనలను సవరించాలని కోరింది. ‘‘2022 నుంచి 2024 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,33,935 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. 36 మంది చనిపోయారు. స్టెరిలైజ్, ఇమ్యునైజేషన్‌ చేసిన అనంతరమే మళ్లీ వీధుల్లోకి వదిలినప్పటికీ శునకాల నుంచి పిల్లలు, వయోవృద్ధులు, ఇతర దుర్బలవర్గాలవారికి ముప్పు పొంచిఉంటుంది. మనుషులను కరవకుండా వాటిని అడ్డుకోలేం. కుక్కల అధిక సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకొని అమెరికా, యూకే సహా పలు దేశాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. వీధికుక్కలను తప్పనిసరిగా నిర్బంధించాలని యూకేలోని పర్యావరణ పరిరక్షణ చట్టం-1990లోని సెక్షన్‌ 149 చెబుతోంది. ఎవరికీ సంబంధించని (అన్‌క్లెయిమ్డ్‌) శునకాలను సాధ్యమైనంత తక్కువ నొప్పితో చంపేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రేబిస్‌ మరణాల్లో 36% భారత్‌లో చోటుచేసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో ఏటా 18-20 వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో నమోదవుతున్న రేబిస్‌ కేసులు, మరణాల్లో 30-60% 15 ఏళ్లలోపు చిన్నారులవే. రేబిస్‌ నుంచి రక్షించాలంటే పెంపుడు కుక్కలకు తొలి ఆరు నెలల్లోనే వ్యాక్సిన్, ఆ తర్వాత ఏటా బూస్టర్‌ డోస్‌ వేయాలి. కుక్కలు రేబిస్‌తోపాటు నులిపురుగులు, రోగాలనూ మనుషులకు వ్యాపింపజేస్తాయి. కుక్కకాటు కారణంగా ఏటా ఎంతోమంది గాయపడటంతోపాటు మృతి చెందుతున్న విషయాన్ని, రహదారి భద్రతకూ శునకాల వల్ల తీవ్ర ముప్పు కలుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మాసనం తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రజల ప్రాణాలను కాపాడటంతోపాటు వారి హక్కులు, భద్రతకు రక్షణ కల్పించాలి’’ అని రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ విన్నవించింది.

Tags :
Published : 28 Oct 2025 03:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని