Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై హరీశ్‌రావు అబద్ధాలు మానుకోవాలి

Eenadu icon
By Telangana News Desk Published : 14 May 2025 04:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం గతంలో కన్నా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే.. మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ అవే నిజాలుగా ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నాలను హరీశ్‌ మానుకోవాలని ఆయన సూచించారు. ‘‘యాసంగి సీజన్‌లో ఇప్పటికే 65 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. గడిచిన రెండేళ్ల యాసంగితో పోలిస్తే 120 శాతం అధికంగా కొంటున్నాం. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవధిలోనే వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి మొత్తం 280 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. ధాన్యం దిగుబడిలో ఇదో రికార్డు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు 65 శాతం మేర ధాన్యం కొనుగోలు పూర్తి చేశాం. గత యాసంగి సీజన్‌తో పోల్చితే ఈసారి కొనుగోలు చేసింది 23.48 లక్షల టన్నులు అధికం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 8,245 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇవి గతేడాది కంటే 1,067 అధికం. ఈ యాసంగి సీజన్‌లో 60.14 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా 1.29 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. అందులో 70.13 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నట్లు భావిస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.58 లక్షల మంది రైతుల నుంచి 43.10 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. వీటి విలువ రూ.9,999.36 కోట్లు కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు రూ.6,671 కోట్లు చెల్లించింది’’ అని ఉత్తమ్‌ తెలిపారు.  

నాడు పట్టించుకోలేదేం: విప్‌ ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లపై మాజీమంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోలేదు కానీ, ప్రతిపక్షంలోకి రాగానే రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మంగళవారం ఆయనొక ప్రకటనలో మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే 61.45% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. 43 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2022లో ఇదే సమయానికి భారాస ప్రభుత్వం 19 లక్షల టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేసింది. దీనికి హరీశ్‌రావు సమాధానం చెప్పాలి. భారాస హయాంలో కొనుగోలు కేంద్రాలు లేక, పంట కొనుగోలు చేయక అనేకమంది రైతులు కల్లాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. హరీశ్‌ అవన్నీ మరిచిపోయినట్లున్నారు’అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని