Cyclone Montha: నిన్న వరద.. నేడు బురద!

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఖమ్మం, వరంగల్‌లో ముంపు కాలనీల జనం ఇక్కట్లు 
పొలాల్లో మేటలు.. తడిసిన ధాన్యంతో అన్నదాతల అవస్థలు 

హనుమకొండలో వరద ఉద్ధృతికి కోతకు గురైన వంద ఫీట్ల రోడ్డు..

ఈనాడు, వరంగల్, ఖమ్మం - సైదాపూర్, శంకరపట్నం, న్యూస్‌టుడే: మొంథా తుపాను వర్షాలు శాంతించినా.. పొలాల్లో ఇసుక మేటలు, రహదారులపై తడిసిన ధాన్యం అన్నదాతకు ఇక్కట్లను మిగిల్చాయి. మరోవైపు ముంపు కాలనీల్లో బురదమయమైన ఇళ్లు.. వరదతో ఛిద్రమైన రహదారులు ఇబ్బందికరంగా మారాయి. ప్రధానంగా వరంగల్, ఖమ్మంలోని ముంపు కాలనీల ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి చెమటోడుస్తున్నారు. 

వరంగల్‌లో అవే పాట్లు..

మొంథా తుపాను ఉమ్మడి వరంగల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ నగరాల్లోని పలు కాలనీలు జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హనుమకొండలోని అమరావతీనగర్, నవయుగకాలనీ, టీవీటవర్స్‌ కాలనీ, గోకుల్‌నగర్, విద్యానగర్, సమ్మయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని నిత్యావసరాలు, సామగ్రి, విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. శుక్రవారం వరద తగ్గడంతో ఇళ్లల్లో సామగ్రి, వస్తువులు, విద్యార్థుల పుస్తకాలు ప్రధాన రోడ్లపై ఆరబెట్టారు. నగరంలోని పలు ప్రధాన రహదారులు సైతం పూర్తిగా దెబ్బతిని ఆనవాళ్లు కోల్పోయాయి. 

ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డలో ఇళ్లలో చేరిన బురదను శుభ్రం చేసుకుంటున్న మహిళలు 

ఖమ్మంలో..  

ఖమ్మం నగరం, ఏదులాపురం పురపాలికలో పలు కాలనీలను గురువారం వరద ముంచెత్తగా.. శుక్రవారం బురదతో ఆయా కాలనీలవారు సతమతమయ్యారు. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వాగు ఎట్టకేలకు శాంతించింది. మున్నేరు ఉరకలెత్తడంతో ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ కాలనీ, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, పద్మావతీనగర్, మోతీనగర్, ఏదులాపురం పురపాలికలోని కేబీఆర్‌ నగర్, జలగంనగర్‌ తదితర పదకొండు కాలనీలు గురువారం ముంపునకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంపు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లల్లోకి చేరుకున్నారు. బాధితులంతా ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రహదారులను ఖమ్మం నగరపాలక సిబ్బంది ట్యాంకర్లతో శుభ్రం చేశారు. వరద వచ్చిన ప్రతిసారీ వాననీరు, బురదతో ఇబ్బందులు తప్పడం లేదని.. ఏటా దుస్తులు, ఎలక్ట్రికల్‌ సామగ్రి దెబ్బతింటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్‌ కరకట్ట త్వరితగతిన నిర్మించాలని వేడుకుంటున్నారు.

హనుమకొండ జిల్లా వివేక్‌నగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో బురద నీటిలో కూరుకుపోయిన సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న కుటుంబ సభ్యులు

 

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం సోమారంలో తుడిచిపెట్టుకుపోయిన వరి పొలంలో మేట వేసిన రాళ్లు, రప్పలు


ఖమ్మం జిల్లా కూసుమంచిలో నేలకొరిగిన వరి పైరు 

ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంలో నీట మునిగిన వరి పొలాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని సైదాపూర్, చిగురుమామిడి, శంకరపట్నం, హుజూరాబాద్‌ మండలాల్లో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. కొందరి పొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు పేరుకుపోయాయి. కల్లాలు, రోడ్లపై నిల్వ చేసిన వరి ధాన్యం పూర్తి స్థాయిలో ఎండకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు