dasarathi krishnamacharya: నిరంకుశ పాలనపై పోరాడిన ధీశాలి దాశరథి
మహబూబాబాద్ జిల్లాకు ఆయన పేరు పెట్టేందుకు కృషి
రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
జూకంటి జగన్నాథానికి డా.దాశరథి కృష్ణమాచార్య పురస్కార ప్రదానం

కవి జూకంటి జగన్నాథానికి డా.దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేసి, సత్కరిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బాలాచారి, లక్ష్మణాచారి, సత్యనారాయణ, బండా ప్రకాశ్, ఇందిర, అందెశ్రీ, వాణీప్రసాద్, అలేఖ్య పుంజాల, మామిడి హరికృష్ణ
రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’లుగా మలచి నిజాం నిరంకుశ పాలనపై ప్రయోగించిన ధీశాలి డా.దాశరథి కృష్ణమాచార్య అని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కీర్తించారు. సోమవారం రవీంద్రభారతిలో డా.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి జూకంటి జగన్నాథానికి ‘డా.దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’ ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ‘‘డా.దాశరథి తన సాహిత్య జీవనయాత్రలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి రజాకార్ వ్యతిరేక ఉద్యమానికి సహకారం అందించారు. పేదరికం ఒక భావన మాత్రమేనని... కూడు, గూడు, గుడ్డలు లేనివాళ్లు పేదలు కాదని, సమాజంలో తాను ప్రేమించేవారు... తనను ప్రేమించేవారు లేనివాళ్లే నిజమైన పేదలని దాశరథి స్పష్టంచేశారు. నాడు కోట్ల మందిని కదిలించిన దాశరథి కుటుంబాన్ని ఆదుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. దాశరథి సొంత జిల్లా మహబూబాబాద్‌కు ఆయన పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు కోరగా... సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమవంతు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తన గీతాలతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన గొప్ప వ్యక్తి దాశరథి అని కొనియాడారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ... విద్యార్థి జీవితంలో దాశరథి కవితలు తమకు దారి చూపాయన్నారు. ఏడు దశాబ్దాల క్రితం ‘ఆ చల్లని సముద్రగర్భం’ పాటలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు నేటికీ సమాధానం దొరకలేదన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ స్వాగతం పలికారు. పురస్కార గ్రహీత జూకంటి స్పందిస్తూ... ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న పదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రముఖ కవి అందెశ్రీ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, దాశరథి కుమార్తె ఇందిర, కుమారుడు లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






