అక్షరాన్ని హత్తుకుంటున్నారు!

హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు నీరాజనం పలుకుతున్నారు. పుస్తకావిష్కరణలు.. కొత్త పుస్తకాల పరిచయం.. రచయితల అనుభవాలు... సమకాలిన అంశాలపై చర్చలతో పుస్తక ప్రదర్శన ఆసక్తిగా కొనసాగుతోంది.

Published : 25 Dec 2022 03:21 IST

జాతీయ పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన
300 వరకు స్టాళ్లు.. జనవరి 1 వరకు నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు నీరాజనం పలుకుతున్నారు. పుస్తకావిష్కరణలు.. కొత్త పుస్తకాల పరిచయం.. రచయితల అనుభవాలు... సమకాలిన అంశాలపై చర్చలతో పుస్తక ప్రదర్శన ఆసక్తిగా కొనసాగుతోంది. మూడో రోజు శనివారం వారాంతం కావడంతో పుస్తక ప్రియులు పెద్దఎత్తున ప్రదర్శనకు తరలివచ్చారు.ఈ నెల 22న మొదలైన 35వ జాతీయ పుస్తక ప్రదర్శన జనవరి 1 వరకు జరగనుంది. ఇందులో 300 వరకు స్టాళ్లు ఏర్పాటుచేశారు. ప్రదర్శనకు సామాన్యులతో పాటు ప్రముఖులు, రచయితలు విచ్చేసి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.

తెలుగు సాహిత్యంలోని గుబాళింపును ఆస్వాదిస్తూ.. ఇతర భాషల్లోని రచనలను పరిచయం చేసుకుంటున్నారు. అభిమాన రచయితలు కనిపిస్తే సంభ్రమాశ్చర్యానికి లోనవుతున్నారు. డిజిటల్‌ యుగంలోనూ తమను అక్షరమే హత్తుకుంటోందని పాఠకులు చాటుతున్నారు. కొన్నేళ్లుగా పుస్తక ప్రదర్శనను తిలకించడం అలవాటుగా మార్చిన ఘనత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీకే దక్కుతుంది. డిసెంబరు చివరి వారం వచ్చిందంటే క్రిస్మస్‌, కొత్త సంవత్సర సంబురాలతో పాటు హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్‌ స్టేడియంలో పది రోజులపాటు పుస్తకాల పండగను మోసుకొస్తుందని పాఠకులు ఎదురుచూస్తుంటారు.

విద్యార్థులు ఎక్కువ..

ఈసారి ప్రదర్శనకు వస్తున్న వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. పుస్తక పఠనాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలు తమ విద్యార్థులను బృందాలుగా ప్రదర్శన సందర్శనకు ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు రాసిన పుస్తకాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. క్రిస్మస్‌ సెలవులు కావడంతో తల్లిదండ్రులు సైతం పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. కార్టూన్లు, చందమామ కథలు, పెద్ద బాలశిక్ష తదితరాలను కొంటున్నారు. యువత ఎక్కువగా పోటీ పరీక్షల పుస్తకాలపై దృష్టిసారిస్తోంది.

రచయితల కోసం..

రచయితల కోసం విశాలమైన స్టాల్‌ కేటాయించారు. పుస్తకాలను ప్రదర్శించి.. విక్రయించేందుకు వారికి అవకాశం కల్పించారు. పుస్తకాల గురించి స్వయంగా రచయితలే వివరిస్తున్నారు. పాత సాహితీ మిత్రులను కలుసుకోవచ్చని.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చని.. కొత్తతరం ఆలోచనలను తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో కొందరు రచయితలు ఇక్కడికి వస్తున్నారు. పుస్తక ప్రదర్శనకు వచ్చి వెళుతున్న వారికి మొక్కలను బహూకరిస్తున్నారు.

ముఖ్యమంత్రి పేరుతో స్టాల్‌

మన ముఖ్యమంత్రి పేరుతో స్టాల్‌ ఏర్పాటు చేసి అందులో కేసీఆర్‌ గురించి, ఆయన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై పలువురు రచయితలు రాసిన పుస్తకాలను ప్రదర్శించారు. సీఎంపై ఇన్ని పుస్తకాలు వచ్చాయా అనేంత స్థాయిలో ఉన్నాయి. ఈ స్టాల్‌ను పర్యావరణవేత్త వేదకుమార్‌ శనివారం ప్రారంభించారు. జూలూరు గౌరీశంకర్‌ రాసిన జీవధార, తెలంగాణ విజయగాథ], ఆత్మబంధువు, ఒక్కగానొక్కడు, పెద్దూరి వెంకటదాసు రచించిన తెలంగాణ కేసరి, కన్నోజు మనోహరాచారి రచించిన తెలంగాణ అభ్యుదయం, దేశానికి మహోదయం, మనోహర చిమ్మని రచించిన కేసీఆర్‌.. ది ఆర్ట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌, తినేత్రి, దటీజ్‌ కేసీఆర్‌ పుస్తకాలను ప్రదర్శించారు.

డిజిటల్‌ రిపాజిటరీపై వివరణ

ఈసారి ప్రదర్శనలో తెలుగు, ఇతర రాష్ట్రాల్లోని ప్రచురణకర్తల స్టాళ్లతో పాటు పలు కొత్తవి ఏర్పాటయ్యాయి. భవిష్యత్తు తరాలకు తెలంగాణ అస్తిత్వ నిధిని అందించేందుకు ఇప్పుడున్న తాళపత్రాలు, పుస్తకాలు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్లను అత్యాధునిక ఐటీ ఉపకరణాల సాయంతో డిజిటల్‌ రూపంలో భద్రపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ‘తెలంగాణ డిజిటల్‌ రిపాజిటరీ’ తీసుకురాబోతున్నారు. ఐటీ శాఖకు చెందిన డిజిటల్‌ మీడియా విభాగం ఈ బాధ్యతలు చూస్తోంది. ఈ కృషి గురించి సందర్శకులకు వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు